CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం డిజైన్ల తయారీలో ప్రభుత్వ వైఖరి ఆది నుంచి సందేహాలకు తావిస్తున్నది. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రూపకల్పన ముఖ్యమంత్రితోపాటు ఆయన ఎంపికచేసుకున్న కొద్దిమంది సలహాదారులు, కన్సల్టెంట్ల మధ్య, ఓ క్లోజ్డ్ రూమ్‌లో జరగడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రజా ప్రయోజనాల కోసమే చేపడుతున్నట్లు చెబుతున్న ఈ ప్రాజెక్టులో సంబంధిత విభాగం అధికారులకే చోటు కల్పించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలను రేకెత్తిస్తున్నది. ఇది ముఖ్యమంత్రి సొంత వ్యవహారంలా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే ఆర్అండ్బీ శాఖను ట్రిపుల్ ఆర్ డిజైన్ల తయారీలో ప్రభుత్వం పూర్తిగా దూరం పెట్టింది.
ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వద్ద నిర్వహించే సమావేశాలకు ఒకరిద్దరు ప్రభుత్వ సలహాదారులు, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, కన్సల్టెంటు ఏజెన్సీ ప్రతినిధులు తప్ప ఇతరులకు ప్రవేశం లేకుండా చేశారు. ఇటీవల జరిగిన సమావేశానికి ఆర్అండ్బీ ఇంజినీరింగు అధికారులు వెళ్లినప్పటికీ వారిని బయటనే ఉంచారు. వారికి కనీసం ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదు. ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్‌ను మాత్రమే సమావేశానికి అనుమతించారు. రోడ్లు, భవనాల నిర్మాణం కోసమే ఏర్పాటు చేసుకున్న ఈ శాఖపట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి బహుషా చరిత్రలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.
ఇంజినీర్లు డిజైన్లు సిద్ధంచేస్తే, ఈఎన్సీ లేక చీఫ్ ఇంజినీర్ హోదాలో ఉండే అధికారి వాటిని ప్రభుత్వ పెద్దలకు వివరించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. కన్సల్టెంట్లు తాము రూపొందించిన అలైన్‌మెంట్‌ను ప్రభుత్వ సలహాదారుల సమక్షంలో సీఎంకు వివరించారు. మనం సొంత ఇంటి నిర్మాణం కోసం నియమించుకున్న ఇంజినీర్లకు ఎలాగైతే సూచనలు చేస్తామో.. అదే ధంగా సీఎం కన్సల్టింగ్ ఏజెన్సీకి సూచనలు చేస్తున్నారని, ఎక్కడా ఆర్అండ్బీ ఇంజినీర్లను భాగస్వాములను చేయడంలేదని చెప్తున్నారు. దీంతో ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారమా.. లేక ముఖ్యమంత్రి సొంత వ్యవహారమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ట్రిపుల్ ఆర్ విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న ఈ గోప్యత అనేక సందేహాలకు తావిస్తున్నది. దీని వెనుక పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతున్నది.
ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి గతంలో ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణం సందర్భంగా జరిగిన అక్రమాలను జ్ఞప్తికి తెస్తున్నది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగురోడ్డు.. పెద్దల ప్రయోజనాల కోసం అష్టవంకరలు తిరిగిన విషయం ఇంకా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇందులో పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోగా, భూములు కొనుగోలు చేసుకున్న పెద్దలు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లకు పడగలెత్తారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్‌ను తమ అనుయాయుల రియల్ ఎస్టేట్ దందా కోసం ఓ గొప్ప అవకాశంగా మలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌కు తుదిరూపం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక మార్పులు, చేర్పులు జరగాల్సి ఉందని సాక్షాత్తూ అధికారవర్గాలే చెప్తున్నాయి. అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని, ప్రభుత్వ ఆలోచనలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు బేరేజు వేసుకొని అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కమిటీ నివేదిక ఇస్తుందని, అనంతరం మార్పులు చే ర్పులు చేసి అలైన్‌మెంట్‌కు తుదిరూపం ఇస్తారని అంటున్నారు. అలైన్మెంట్ విషయంలో ప్రభు త్వం ఇస్తున్న లీకులతో రైతులు ఆందోళనలో ఉండగా, రియల్టర్లు మాత్రం అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
తమను ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో భాగస్వాములను చేయకపోవడమే మంచిదని కొందరు ఆర్అండ్బీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న విధంగా చేసుకుంటూపోతే ప్రజలనుంచి వ్యతిరేకత రావడమే కాకుండా భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అలైన్‌మెంట్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా ద్వారానే తమకు తెలిసిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో కూడా ఎవరున్నారో తమకు సమాచారం లేదని తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను ఖరారుచేసి తమకు ఏదైనా టాస్క్ అప్పగిస్తే దాన్ని పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.