రంగారెడ్డి, ఫిబ్రవరి 10 (నమస్తేతెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) ముందుగా పంచాయతీలకా లేదా పరిషత్‌లకు నిర్వహిస్తారా అనే ఉత్కంఠకు తెరపడటంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ముందుగా పంచాయతీ ఎన్నికలా.. పరిషత్ ఎన్నికలా అని ప్రకటించడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడచూసినా పంచాయతీ, పరిషత్ ఎన్నికలపైనే చర్చ జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 531 గ్రామపంచాయతీలున్నాయి. అలాగే, 257 ఎంపీటీసీలు, 21 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆశావాహులంతా ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల తుదిజాబితాను కూడా ప్రకటించారు. గ్రామాల్లో పోలింగ్స్టేషన్లను కూడా గుర్తించి ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడటంలేదు. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ప్రకటించాలని బీసీలు, పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. జనాభా లెక్కల్లో బీసీల సంఖ్య తగ్గిందని, తిరిగి మల్లీ రీసర్వే జరపాలని కోరుతుండగా.. ప్రభుత్వం ఏమేరకు నిర్ణయం తీసుకుంటుందనేది చర్చించుకుంటున్నారు. కాగా, రిజర్వేషన్లు గతంలో మాదిరిగానే కొనసాగుతాయా లేక, మారుస్తారా అనేదానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ప్రకటిస్తే మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాలోని సగభాగంపైగా మున్సిపాలిటీల్లో కలిసిపోయినప్పటికి మిగతా ప్రాంతాల్లో కూడా పోటీ తీవ్రంగా ఉన్నప్పటికి రిజర్వేషన్లపైనే అందరు గురిపెట్టుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలుండటంతో జిల్లాలో ఎన్నికల కోసం ప్రధానపార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు, ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగమే జిల్లాపార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని సూచిస్తున్నారు.
అలాగే, అధికార కాంగ్రెస్‌పార్టీ కూడా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటుంది. జిల్లాలో చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అలాగే, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్‌పార్టీ ఆధీనంలో ఉన్నాయి. మహేశ్వరం నియోజకవర్గం ఒక్కటి బీఆర్ఎస్ ఆధీనంలో ఉంది. దీంతో అత్యధిక స్థానాలను కైవలం చేసుకుని అన్ని మండలాలను తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే, బీజేపీ కూడా ఇతర రాష్ట్రాల్లో వరుస విజయాలతో ఊపుమీదున్న ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని భావిస్తోంది.
రంగారెడ్డిజిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,63,665మంది ఓటర్లున్నారు. అలాగే, జిల్లాలో మొత్తం 531 గ్రామపంచాయతీలు, 4,710వార్డులున్నాయి. అలాగే, 252ఎంపీటీసీలున్నాయి. ఇటీవల జిల్లాలోని ఆరు మండలాల్లో 25ఎంపీటీసీలు, మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. మొయినాబాద్‌లో 8, శంకర్‌పల్లిలో 2, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 3, శంషాబాద్‌లో 3, కొత్తూరులో 4, చేవెళ్లలో 3 ఎంపీటీసీలు మున్సిపాలిటీల్లో కలిసాయి. దీంతో జిల్లాలో 25ఎంపీటీసీలు తగ్గగా 257స్థానాలున్నాయి. అలాగే, 21 జడ్పీటీసీలున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లాలో బీఆర్ఎస్పార్టీ తమ సత్తా చాటుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసంచేసిందని, ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవటంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేఖత మొదలుకుంది. ఆ వ్యతిరేఖతనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఓటు అనే ఆయుధం ద్వారా గుణపాఠం చెప్తారు.