Congress | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): చెడు జరిగితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపం.. మంచి జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘనకార్యం.. లేదా ప్రస్తుత రేవంత్ సర్కారు గొప్పతనం.. ఇదీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సర్వరోగ నివారిణిగా ఎంచుకున్న మంత్రం. అందుకే నిన్నటిదాకా తేలు కుట్టినట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం సుంకిశాల ఘటన బయటికి రాగానే ఈ మంత్రాన్ని జపిస్తున్నది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సెలవిచ్చారు.
హైదరాబాద్ మహా నగరం పదేండ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందనే ప్రశంసలు వస్తే మాత్రం అది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాగితాలెక్కిన ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయాల పుణ్యమట. 24 గంటల కరెంటుకు చంద్రబాబు ఆద్యుడట. రేవంత్ ప్రభుత్వ హయాంలో గేట్లు బిగించి తప్పుడు అంచనాలతో సొరంగం తెరిచి రక్షణ గోడ విధ్వంసం జరిగితే మాత్రం దానికి కేసీఆర్ ప్రభుత్వం కారణమట! చెప్పేవారికి వినేవాళ్లు లోకువన్నట్టు ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పూట గడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుంకిశాల ఘటనపై గురువారం ప్రభుత్వ పెద్దల స్పందనే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. సుంకిశాల పాపం నిజంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనైతే మరి ఈ ప్రశ్నలకు సమాధానమేది?
సుంకిశాల బీఆర్ఎస్ పాపం అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ ‘వారం రోజుల పాటు ప్రభుత్వం గోప్యత పాటించడం’తోనే అసలు పాపం ఎవరిదో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. అంతేకాదు, గత ఎనిమిది నెలలుగా కమిటీలు, కమిషన్లు అంటూ ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎందుకు నోరు విప్పలేదనే ప్రశ్న కూడాతలెత్తుతున్నది.
మేడిగడ్డ ఘటన అనేది ఎవరూ ఊహించనిది. శబ్ధం వచ్చే వరకు అది ఎవరికీ తెలియలేదు. కానీ సుంకిశాల ఘటన అలా కాదు. షిఫ్టు మార్పు అనేది ప్రాణనష్టం జరగకపోవడానికి ఒక కారణమైనప్పటికీ అదే పూర్తి కారణం కాదు. ‘నమస్తే తెలంగాణ’ ఇంకా లోతైన విచారణ చేసిన సందర్భంగా మరో వాస్తవం కూడా బయటపడింది. గేటు అమర్చి, సొరంగాన్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత నీటి ఒత్తిడికి గేటు క్రమంగా వంగిపోవడం అనేది నెమ్మదిగా జరిగింది.
ఆ విషయాన్ని ముందుగానే కార్మికులు, ఇంజినీర్లు పసిగట్టారు. ఈ క్రమంలో ముందుగా లీకేజీ ప్రారంభమైంది. దీంతో ఆరు గంటల షిఫ్టు ముగించుకొని కార్మికులు అందరూ వాహనంలో పంపుహౌస్ బయటికి వచ్చేశారు. షిఫ్టు ముగిసినప్పటికీ కొందరు అక్కడే ఉండడం, ఇతరులతో మాట్లాడుతుండడం చేయడం సహజం. కానీ లీకేజీ మొదలైనందున అది కుప్పకూలిపోతుందని పసిగట్టే కార్మికులతో పాటు టెక్నీషియన్లు, సైట్ ఇంజినీర్లు అందరూ బయటికి వచ్చేశారు.
ఆ క్రమంలోనే కొందరు వాహనంలో పైకి వస్తూ సెల్ఫోన్లో చిత్రీకరించారు. అందుకే, బయటికొచ్చిన వీడియోలో ‘టూట్ గయా’ (విరిగిపోతుంది) అంటూ కార్మికులు అరవడం వినిపించింది. అంటే అది విరిగిపోనుందనే విషయం ముందుగానే పసిగట్టారు. నాసిరకం నిర్మాణమో, డిజైన్ లోపమో అయితే అనూహ్య ప్రమాదం జరగాలి. కానీ, వాల్ కూలిపోతున్నదని కార్మికులు ముందే గుర్తించారు. అంటే అంతకుముందు తమకున్న చర్య (సొరంగం తెరవడం) వల్ల ఇది జరుగుతున్నదనే సంగతిని వారు పసిగట్టి జాగ్రత్తపడ్డారు. దీంతో మేడిగడ్డ మాదిరిగా ఇది అనుకోని ఘటన కాదు.
మేడిగడ్డ ఘటన జరిగినపుడు బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించిన తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే మీడియాకు సమాచారం ఇచ్చిం ది. తదుపరి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు బరాజ్‌పై రాకపోకలు నిలిపివేసింది. ఘటనపై బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎల్అండ్టీ సంస్థతో అధికారికంగా ప్రకటన చేయించింది.
వాస్తవాన్ని అందులో పొందుపరచడంతో పాటు ప్రభుత్వంపై భారం లేకుండా బరాజ్ పునరుద్ధరణ పనులు చేపడతామంటూ ఏజెన్సీ అందులో స్పష్టం చేసింది. ఒకవిధంగా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అది ప్రతికూల పరిణామం. అయినప్పటికీ విషయాన్ని దాచి పెట్టకుండా, జరిగిన వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచింది. ఎక్కడా ఘటన జరగలేదంటూ గోప్యత పాటించలేదు.
కానీ సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా వారం రోజుల పాటు గోప్యత పాటించింది. ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెస్తే తప్ప జరిగిన వాస్తవాన్ని అంగీకరించలేదు. పైగా ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నది.