హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు రేవంత్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆమె వద్ద ఓఎస్డీగా పనిచేసే సుమంత్‌ను విధుల నుంచి తప్పించడమే గాక ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్న క్రమంలోనే సురేఖ శాఖకు చెందిన పనులను అకస్మాత్తుగా ఆర్‌అండ్‌బీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశమైంది. అదీగాక ఆమె శాఖ పరిధిలోని మేడారం అభివృద్ధి పనులను పొంగులేటికి చెందిన కంపెనీ దక్కించుకోవడం.. ఉప్పు-నిప్పులా ఉండే సురేఖ, పొంగులేటి మధ్య మరింత ఆజ్యం పోసినట్టయ్యింది.
మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నాడని విమర్శించడమే గాక పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మేడారం పనులు పొంగులేటి కంపెనీకే అప్పగించినట్లు తెలిసింది. అయితే దీనిపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. కొంతకాలంగా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలు భగ్గుమంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం ఆమెను మరింత ఆగ్రహానికి గురిచేసినట్టు సమాచారం. అంతేగాక జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతున్న సురేఖకు అటు స్థానిక నేతల నుంచి, ఇటు పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి సహకారం లభించడం లేదని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, వరంగల్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్లో సింహభాగం ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇదివరకే కొండా దంపతులకు వ్యతిరేకంగా పలువురు జిల్లా కాంగ్రెస్ నేతలు పార్టీ హైకమాండ్‌కు, క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ పూర్తయి రేపో మాపో చేపట్టాల్సిన రూ.101కోట్ల మేడారం జాతర అభివృద్ధి పనులను అకస్మాత్తుగా ఆర్అండ్బీ శాఖకు బదిలీ చేయడం గమనార్హం. గద్దెలు, ప్రాకారం గోడ నిర్మాణంతో పాటు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గత నెల 24న దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేయగా, ఈ నెల 10న టెండర్ కూడా పూర్తయింది. పనులు యుద్ధప్రాతిపదికన చేపడితే తప్ప గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశం లేదు. దేవాదాయ శాఖ వద్ద భారీ స్థాయి పనులు చేపట్టే సాంకేతికత లేనందునే ఆర్‌అండ్‌బీకి అప్పగించినట్లు చెబుతున్నప్పటికీ దీని వెనుక అసలు కథ వేరే ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సురేఖ పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు, ఆమెను త్వరలోనే మంత్రి పదవి నుంచి తప్పిస్తారని మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, పార్టీలో అసంతృప్తి చెలరేగకుండా ఉండేందుకు పార్టీ హైకమాండ్ సూచనల ప్రకారం పాతవారిని కదిలించకుండానే ముగ్గురు కొత్త మంత్రులకు స్థానం కల్పించారు. ముఖ్యంగా బీసీ నేతను మంత్రివర్గం నుంచి తప్పించారనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే పార్టీ వెనక్కి తగ్గినట్లు అప్పట్లో రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా ఆమె వద్ద పనిచేస్తున్న ఓఎస్డీపై అవినీతి ఆరోపణలు రావడం, ఈ వ్యవహారం అరెస్టు వరకూ వెళ్లడం చూస్తుంటే సురేఖను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.