హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పెట్టుబడి సాయం అందక అప్పులు చేసి, అష్టకష్టాలు పడి ఎరువులు కొని మరీ పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడం సవాల్‌గా మారింది. పెసర, పత్తి కొనుగోళ్లు ప్రారంభించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మక్క రైతుల గోస పుచ్చుకుంటున్నది. మక్క కోతలు మొదలైనా కొనుగోళ్లను ప్రారంభించలేదు. మక్కల కొనుగోలుకు సంబంధించి మార్క్‌ఫెడ్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వాటిని పరిశీలించి, అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొనుగోలు కేంద్రాలు లేక, బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు. వానకాలం సీజన్లో రాష్ట్రంలో సుమారు 6.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది. సుమారు 15 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతాయని అంచనా.
ప్రభుత్వం మక్కలకు క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400గా నిర్ణయించింది. గతంతో పోల్చితే ఈ సీజన్లో బహిరంగ మార్కెట్లో మక్కలకు డిమాండ్ తగ్గిపోయింది. క్వింటాలుకు రూ.1,700 నుంచి రూ.1,900 మాత్రమే ధర పలుకుతున్నది. అదికూడా మక్కలు మంచి నాణ్యంగా ఉంటేనే. ఒకవేళ నాణ్యతలో ఏ మాత్రం తేడా ఉన్నా ధర రూ. 1,500కు మించి పలకడం లేదని రైతులు వాపోతున్నారు. అంటే మద్దతు ధరతో పోల్చితే రైతులు క్వింటాలుకు దాదాపు రూ.700 వరకు నష్టపోతున్నారు. ఎకరానికి సుమారు 25 క్వింటాళ్ల మక్కలు ఉత్పత్తి అవుతాయని నిపుణుల అంచనా. ఈ లెక్కన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఎకరాకు రూ.17,500 వరకు నష్టపోవాల్సి వస్తున్నదని విశ్లేషిస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో ఏ పంటకైనా మద్దతు ధర కన్నా తక్కువ ధర పలికితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా పెట్టి రైతులకు మద్దతు ధర చెల్లించి పంటలు కొనుగోలు చేయాలి. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ప్రైవేటు వ్యాపారులకు పోటీ ఏర్పడుతుంది. వ్యాపారులు సైతం రైతులకు అధిక ధర చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. బహిరంగ మార్కెట్లో మక్కలకు మద్దతు ధర లేదని మార్క్‌ఫెడ్ గ్రహించి, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం పది రోజుల కిందటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 3 లక్షల టన్నుల మక్కల కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని, సంబంధించిన నిధులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం దక్కలేదు. వీటిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీంతో మార్క్‌ఫెడ్ అధికారులు చేతులెత్తేశారు.
మక్కల కొనుగోలుపై ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వరుసగా కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే నష్టపోయామని ఆవేదనలో ఉన్న రైతులు.. కనీసం మిగిలిన పంటకైనా మద్దతు ధర దక్కుతుందేమోనని భావించినా అది నెరవేరడంలేదని వాపోతున్నారు. దీంతో పలు జిల్లాల్లో రైతులు మక్కలను రోడ్లపై ఆరబెడుతున్నారు. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో మక్కలు తడిసిపోయి మొలకొస్తున్నాయని, ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు ఈ కష్టాలు, నష్టాలు తప్పుతాయని రైతులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మక్కలకు మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ.330 బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు బోనస్ సంగతి దేవుడెరుగు.. అసలు మద్దతు ధరకే కాంగ్రెస్ సర్కారు ఎసరు పెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ధర పడిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మక్కల కొనుగోలు కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ంచాం. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ మార్క్‌ఫెడ్