Telangana | హైదరాబాద్. సెప్టెంబర్ 21,(నమస్తే తెలంగాణ): ‘హలో..సర్.. నేను ….సర్ పీఏను మాట్లాడుతున్న.. మీకు ఆ 50 కోట్ల బిల్ రిలీజ్ చేయాలని చెప్పి వారం రోజులైంది. ఇప్పటివరకు క్రెడిట్ కాలేదు. ఏంది ప్రాబ్లం.. ఇంత రిక్వెస్ట్‌గా చెబుతున్నా మీరు పట్టించుకోవట్లే.. ఇంకొకాయన బిల్లులు ఒక్క రోజులనే రిలీజ్ చేసిండ్రట. మా బిల్స్‌కు ఏంటి ఇబ్బంది. ఇైట్లెతే కష్టం. సర్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ..’ మరొకసారి ఫోన్ రాకుండా చూసుకోండ్రి.. ఆ బిల్ ఫాస్ట్‌గా రిలీజ్ చేయండి.
‘కలెక్టర్ గారు..! నమస్తే.. నేను …సర్ పీఏను. ఒక ఫైల్ కాసేపట్లో మీ దగ్గరకు వస్తుంది. చూసి వెంటనే క్లియర్ చేయండి. సర్ దీని గురించి ఫాలోఅప్ చేస్తున్నారు. ఫైల్ మీవద్దకు రాగానే నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి. మీకు నమ్మకమైన ఆర్డీవోకు ఆ పని అసైన్ చేయండి’. లేదంటే సర్ దగ్గర మాట వస్తుంది. ముందుగా ఆ ఫైల్ పని కంప్లీట్ చేయండి.. అంటూ ఆదేశాలు ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పలు విభాగాల్లోని ఉన్నతాధికారులకు సదరు పీఏ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని కిందిస్థాయి అధికారుల వరకు ఈ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి అధికార హోదాలేని వ్యక్తి.. ఇలా ప్రభుత్వ విభాగాల్లో వేలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. నేరుగా ఉన్నతాధికారులకే ఫోన్లు చేసి ఆదేశాలివ్వడంపై విస్తుపోతున్నారు. ఎక్కడో ఉండి నేరుగా ఫోన్లలో ఆదేశాలు ఇవ్వడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఆదేశాలు పాటిస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందులకు బాధ్యత ఎవరిదంటూ పలువురు అధికారులు ఓ సన్నిహిత ఐఏఎస్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజురోజుకూ ఈ ఫోన్ కాల్స్ కారణంగా తమకు శాఖాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకున్నట్టు తెలుస్తున్నది.
ముఖ్యనేత అనుచరుడిగా నామినేటెడ్ పోస్ట్ పొంది..
ఈ ఫోన్‌కాల్స్ వ్యవహారంపై ప్రస్తుతం అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత అనుచరుడిగా ఉన్న సదరు వ్యక్తికి ఇటీవలే ఓ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యనేత ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్తుండగా, ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్లాలని ప్రయత్నించినట్టు సమాచారం. నిబంధనలు ఒప్పుకోకపోవడంతో వెంటనే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి విదేశీ పర్యటనకు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తున్నది.
జాతీయ స్థాయి మీడియా వ్యవహారాలు చూసే పోస్టులో ఆయనను నియమించినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక అప్పటి నుంచి అతడి హవాకు తిరుగులేదని చెప్తున్నారు. కొన్నేండ్ల కిందట రాష్ర్టాన్ని ఓ కుదుపు కుదిపిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా సర్ పేరు చెప్పుకుంటూ బెదిరింపులకు దిగడం, తన పనులు చేసి పెట్టాలని ఒత్తిడి తేవడం చేస్తుండడంతో అధికారులు బెంబెలెత్తిపోతున్నారు. ఈ విషయంపై ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సన్నిహిత ఉన్నతాధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
ముందుగా ఫైనాన్స్శాఖకే ఫోన్లు
ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఫైనాన్స్ శాఖ అధికారులకే సదరు వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. పలువురు కాంట్రాక్టర్ల వద్ద 10 శాతం కమీషన్ తీసుకొని, ఆ శాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వందల కోట్ల పెండింగ్ బిల్స్ క్లియర్ చేయించినట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత రెవెన్యూ, ఎక్సైజ్, ఐఅండ్ పీఆర్ శాఖల్లో తలదూర్చి ఫైళ్లను క్లియర్ చేయించినట్టు సంబంధిత విభాగాల అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకొని సెక్షన్ ఆఫీసర్ల వరకు ఈ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ అందుకున్నట్టు సమాచారం.
ప్రభుత్వంలో కీలక వ్యక్తి పీఏ , పీఆర్వో అని చెప్పుకుంటూ పనులు చేయాలని ఒత్తిడి తెస్తుండగా, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. తొలుత చిన్నపనులే అనుకుంటే ఇప్పుడు పెద్దపెద్ద పనులు చేయాలని ఒత్తిడి తెస్తుండడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తున్నది. సర్ ఆరా తీస్తున్నారంటూ బెదిరించడం ఎక్కువవుతుండడంతో ఆయా విభాగాల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. నేరుగా ప్రభుత్వంలోని ఓ కీలక కార్యాలయం నుంచి ఫోన్లు చేస్తూ పనులు చేసిపెట్టాలని ఆదేశిస్తుండడంతో, అధికారులంతా హడలెత్తిపోతున్నారు.