హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : పేదలకు ఐదు రూపాయలకే అన్నంపెట్టే క్యాంటీన్లకు ఉన్న అన్నపూర్ణ పేరును మార్చాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించడం అనైతికమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ శుక్రవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. వినాశకాలే, విపరీతబుద్ధి అన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి ఉన్నదని మండిపడ్డారు. అన్నపూర్ణ పేరు చెరిపేసి రాష్ర్టానికే అరిష్టం కొని తెస్తున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. అన్నింటిపైనా పంచాయితీలు పెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ తల్లికి, రాజీవ్‌గాంధీ విగ్రహానికి పంచాయితీ? కాకతీయ కళాతోరణంతో పంచాయితీ, ఇప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణకు, ఇందిరాగాంధీ పేరుతో మరో పంచాయితీ.. అని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి చిల్లర మనస్తత్వానికి ఇదొక నిదర్శనమని తెలిపారు. ‘అన్నపూర్ణ’ పేరు కోట్లాది మందికి పవిత్రమైనదని, ఆ పేరు ఆకలితో అలమటించే పేదవానికి అన్నంపెట్టే తల్లి అని అభివర్ణించారు. అలాంటి పేరుతో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లు మూతపడినా, వాటిని మరమ్మతు చేసేందుకు ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. అలాంటి ప్రభుత్వానికి, అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చే నైతిక అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 373 అన్నపూర్ణ క్యాంటీన్లలో ఇప్పటికే 53 కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయని తెలిపారు. మిగతా 320 కేంద్రాల్లో మౌలిక వసతుల్లో లోపాలు ఉన్నట్టు బయటపడిందని తెలిపారు. ఇన్ని కేంద్రాలు మూసివేసి, భోజనం లేక తల్లడిల్లుతున్న వేలాది మందికి జవాబుదారీతనం చూపని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అదే అన్నపూర్ణ తల్లి పేరును తొలిగించి, కొత్త పేరు పెట్టాలని తలపెట్టడం ఘోర అపరాధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ మార్పు ఇదేనా?
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): పేదలకు రూ.5కే భోజనం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో మార్పు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 18 నెలల్లో పేర్లనే మార్చిందని ఎద్దేవా చేశారు. విశ్వవిద్యాలయాల, దవాఖానల, అవార్డుల, నీటిపారుదల ప్రాజెక్టుల, ఫ్లైఓవర్ల, గృహనిర్మాణపథకం, వ్యవసాయ రుణ ప్రోత్సాహకాలు, హరితహారం, అధికారిక నివా సం, తెలంగాణ తల్లి విగ్రహాల పేర్లను ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు.