MLC Kavitha | తెలంగాణ అస్థిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని.. ఈ చర్యను యావత్ తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ మహిళలను, పండుగలను అవమానించారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి అందరి అమ్మ వంటిదని.. ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఎన్నారై విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆన్లైన్ సమావేశంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎన్నారై విభాగం మహేశ్ బిగాల సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు పోషించిన పాత్రను మరవలేమన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవహేళనలకు గురైనా కూడా తెలంగాణ తల్లి మనతో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి ఉద్యమ కారులు, కవులు, కళాకారులు కలిసి రూపం ఇచ్చారని, అలాంటి తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలు, మక్కలు విదేశాల్లో కూడా పండుతాయని, అలాంటప్పుడు అవి తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమంటూ ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. విగ్రహం మార్చడం విషయంలోనూ ప్రభుత్వం గోప్యత పాటించిందని, ప్రజల ఆమోదం ఉన్నట్లయితే గోప్యత ఎందుకు పాటించినట్లని ప్రశ్నించారు.
ఉద్యమ తెలంగాణ తల్లి కోసం మరొక పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఉద్యమ తెలంగాణ తల్లిపై ప్రేమతో విగ్రహ ప్రతిష్టాపన కోసం అనేక గ్రామాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని వెల్లడించారు. కొత్త తెలంగాణ తల్లికి గెజిట్ జారీ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు. భారత మాత, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు కూడా గెజిట్ ఉందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ బతుకమ్మకు పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఎమ్మెల్సీ కవిత ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ అస్థిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొట్టడంలో తాము కూడా భాగస్వాములవుతామని ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగుతామని, మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం కృషి చేస్తామన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లిని రక్షించుకునే క్రమంలో తమ వంతు సాయం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, వివిధ దేశాల బీఆర్ఎస్, జాగృతి నాయకులు జ్యోతి ముద్దం, నవీన్ రెడ్డి, నాగెందర్ రెడ్డి, సుమన్ బల్మూరి, నాగరాజు గుర్రాల, కల్యాణ్ కాసుగంటి, నందిని, అనిల్ శ్రీకర్, శేఖర్, కిశోర్, ప్రభాకర్, సంపత్, రవి దన్నపునేని, హరి ప్రసాద్, శ్వేత, ఆదర్శ, సుకృతి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.