హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తోపాటు జాతీయ జెండానూ (National Flag) ఘోరంగా అవమానిస్తున్నది. గణతంత్ర దినోత్సం రోజున సెక్రటేరియట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి కనీసం దండ కూడా వేయని కాంగ్రెస్ సర్కార్.. రిపబ్లిడే శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన ప్రకటనల్లో త్రివర్ణ పతాకాన్ని తప్పుగా చూపించింది. జాతీయ జెండాలో పైన ఉండాల్సిన కాషాయ రంగును కింద, ఆకుపచ్చ రంగును పైన, మధ్యలో తెలుపు రంగుతో ఉన్న జెండాను ప్రచురించింది. అందులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, అంబేద్కర్ చిత్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ దీనిని ఐటీ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో ఆ పోస్టును తొలగించింది.
ఫ్లాగ్ కోడ్లో ఏముందంటే..
భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకాన్ని ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జండాను ఎగురవేస్తారు. అయితే.. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తుంటాం. ఒక్కోసారి చట్టప్రకారం శిక్షార్హం కూడా అవుతుంది. అందువల్ల జండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జాతీయా జెండాను ఎగురవేయడానికి సంబంధించి 2002లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ను ప్రచురించింది.