బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేయవద్దు. మా ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకుంటే బిడ్డా.. 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుంది. మేం హూందాగా ఉన్నాం. ప్రజల తీర్పును గౌరవించి గమ్మున ఉన్నాం.. గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. తాను షిండే అవుతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో గడరీతో అన్నారు..ఆయన చెప్పింది వాస్తవమే., మా అధిష్ఠానంతో వెంకట్రెడ్డితోపాటుగా ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారు.
– బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
MLA Maheshwar Reddy | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ అధిష్ఠానంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని, షిండే అవుతానని గతంలో గడరీతోనే అన్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై మహేశ్వర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డికి టచ్‌లో ఉండటం ఏమోగానీ, ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్‌రెడ్డే ఆయనతో టచ్‌లో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపీ టికెట్ రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇస్తామని అధిష్ఠానం చెబితే వెంకట్‌రెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. అదీగాక తమ్ముడికి, మంత్రికి గొడవలు అవుతున్నాయని, అలాంటిది వేరే పార్టీ నేతలు వారితో టచ్‌లోకి ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. బీజేపీకి చెందిన ఏ ఒక ఎమ్మెల్యేకు ఇప్పటి వరకు అలాంటి చరిత్ర లేదని వెల్లడించారు. ‘బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేయవద్దు. మా ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకుంటే బిడ్డా.. 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుంది. మేం హూందాగా ఉన్నాం. ప్రజల తీర్పును గౌరవించి గమ్మున ఉన్నాం’ అని హెచ్చరించారు. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఖాళీ అవుతుందని తేల్చిచెప్పారు. అంతేకాదు తాను షిండే అవుతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో గడరీతో అన్నారని, ఆయన చెప్పింది వాస్తవమేనని, తమ అధిష్ఠానంతో వెంకట్రెడ్డితోపాటుగా ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉన్నదని మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విచారణల పేరుతో రేవంత్‌రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ చిట్టా తమ వద్ద ఉన్నదని వెల్లడించారు. ఆర్-ట్యాక్స్ కింద రూ.3 వేల కోట్లు వసూలు చేశారని, హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో సీఎం పదవి పోతుందనే భయం రేవంత్‌రెడ్డికి ఉన్నదని విమర్శించారు. సీఎం పదవిపై 10 మంది మంత్రులు కన్నేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరేవారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని, మరిప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారు? అని ప్రశ్నించారు. గతంలో రంజిత్‌రెడ్డి అవినీతి చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారని, ఇప్పుడు ఎంపీ టిక్కెట్ ఇచ్చి ఆయనకే ఓట్లేయాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఉంటే తాము సహకరిస్తామని, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడాలని చూస్తే ఊరోకోబోమని కాంగ్రెస్ సర్కార్‌ను హెచ్చరించారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానని అడిగారని, అవసరం లేదని తాను చెప్పానని, అది మనసులో పెట్టుకునే ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులు అమిత్‌షా, గడ్కరీ వద్దకు వెళ్లి తాను ఏదో చెప్పానని అంటున్నారని, వారిద్దరిని తీసుకొస్తే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు.