అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలనను చూసి నేర్చుకోవచ్చు. రాష్ట్రంలో ఏ టూ జడ్ కుంభకోణాలే. కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఒక సిలబస్ మోడల్‌గా పెట్టొచ్చు. రేవంత్ కుటుంబం, ఎనుముల బ్రదర్స్, క్యాబినెట్‌కు పనికొచ్చే ప్రతిదానికో రేటు చొప్పన వసూలు చేసే వ్యవస్థీకృత అవినీతి పాలసీని రేవంత్‌రెడ్డి తెచ్చిండు.
-హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ (Congress) రెండేండ్ల పాలనలో ఏం జరిగిందంటే.. అభివృద్ధి కాదు. అసమర్థత! పారదర్శకత కాదు.. దోపిడీ! గ్యారెంటీలు కాదు.. గారడీ!ఇది ప్రజాపాలన కాదు. నయవంచక పాలన..రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రైవేట్ లిమిటెడ్ పాలన! ప్రజలకు రోదన, వేదన తప్ప మరేం మిగిల్చలేదు. స్కీమ్‌ల రద్దు తప్ప మరేంలేదు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)నిప్పులు చెరిగారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనను రెండేండ్ల మొండిచెయ్యిగా అభివర్ణించారు. సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ధోకా చేసిందని, రాష్ర్టాన్ని అధోగతిపాలుచేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ విజన్ విధానమేంటో స్పష్టంచేయలేదని, అంతా గందరగోళం.. ఆయోమయం.. ఆగమాగం.. సగం సగం అన్నట్టుగా ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వ పనితీరును అంచనావేసేందుకు మొదటి రెండేండ్లు కీలకమని, పాలనకు గీటు రాయని, కానీ ఈ రెండేండ్ల పాలనలో అభివృద్ధి.. సంక్షేమంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదని, మూడు మాటల్లో చెప్పాలంటే నిస్సారం, నిష్పలం, నిరర్థకం తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. రెండేండ్ల పాలనలో చేసిన ఒక్క పనినైనా రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ మొదటి రెండేండ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దగలిగారని గుర్తుచేశారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పింఛన్ పెంపు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గురుకులాల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం, రేషన్ బియ్యం కోటా ఆరు కిలోలకు పెంపు, అత్యుత్తమ టీఎస్ఐపాస్ పాలసీ తదితర కార్యక్రమాలు అమలు చేసినట్టు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలిపామని, శాంతిభద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిపామని వెల్లడించారు. కానీ, రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండిచెయ్యే చూపిందని తూర్పారబట్టారు.
వ్యవస్థీకృత అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్సే
అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలనను చూసి నేర్చుకోవచ్చని హరీశ్ ఎద్దేవాచేశారు. కరప్షన్‌ను నేర్పడానికి కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఒక సిలబస్ మోడల్‌గా పెట్టవచ్చని విమర్శించారు. రేవంత్ కుటుంబం, ఎనుముల బ్రదర్స్, కేబినెట్‌కు పనికొచ్చే ప్రతిదానికో రేటు చొప్పన వసూళ్లు చేసే వ్యవస్థీకృత అవినీతి పాలసీని రేవంత్‌రెడ్డి తెచ్చారని ధ్వజమెత్తారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం బిల్డర్లతో సమావేశం పెట్టి, నాలా కన్వర్షన్‌కు ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్తే ఆన్లైన్లో నాలా కన్వర్షన్‌ను జారీచేశామని గుర్తుచేశారు.
ఆర్డీవోలు, కలెక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా చేశామని, నాలా కన్వర్షన్ ఫీజును 8 శాతం నుంచి 2 శాతానికి తగ్గించి పారదర్శకతను పెంచామని, అదే రేవంత్‌రెడ్డి తమిళనాడు, కర్ణాటక లెక్క స్వేర్ ఫీట్‌కు 80 నుంచి 100 రూపాయల లంచం రేటు ఫిక్స్ చేసేందుకు బిల్డర్లతో సమావేశం ఏర్పాటు చేశారని.. రేవంత్పాలనకు, కేసీఆర్ పాలనకు ఇదే తేడా అని స్పష్టంచేశారు. లే ఔట్ అనుమతికి 30 శాతం, ఫైనాన్స్‌లో బిల్లులకు 30 శాతం, ల్యాండ్ కన్వర్షన్‌కు 30 శాతం చొప్పున వసూళ్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్ఆర్ ట్యాక్స్, భట్టి ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ అంటూ కొత్త రేట్లు ఫిక్స్ చేశారని మండిపడ్డారు. మద్యం సరఫరాదారులకు రేట్లు ఫిక్స్ చేశారని, దీంతో వారంతా మద్యం సరఫరా ఆపేస్తామని హెచ్చరిస్తూ నోటీసులిచ్చే దుస్థితి నెలకొన్నదని చెప్పారు. బిల్లుల కోసం ఏకంగా ఆర్థిక మంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి రావడం దురదృష్టకరమని వాపోయారు.
అన్నీ స్కామ్‌లే
ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రేవంత్‌రెడ్డి తెరలేపారని హరీశ్ విమర్శించారు. ‘సివిల్ సప్లయీస్‌లో ధాన్యం అమ్మకాల స్కామ్. సెంట్రల్ యూనివర్సిటీ భూముల స్కామ్. రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల స్కామ్. ఫ్లైయాష్ రవాణాలో స్కామ్. హిల్ట్ పాలసీ స్కామ్. 50 వేల కోట్ల పవర్ స్కామ్. ఒక ఎమ్మెల్యే యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న స్కామ్. హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో, హ్యామ్ రోడ్లలో స్కామ్. హెచ్ఎండీఏ స్కామ్. లిక్కర్ స్కామ్. ఫెయిలైన వైద్య విద్యార్థులను పాస్‌చేసేందుకు స్కామ్. కాదేదీ కవితకు అనర్హమన్నట్లు.. రేవంత్‌రెడ్డి పాలనలో కాదేదీ స్కామ్‌కు అనర్హం అన్న పరిస్థితి తయారైంది’ అని నిప్పులు చెరిగారు. మార్కుల స్కామ్‌లో ఒక వర్సిటీ వీసీ రాజీనామా చేయాల్సి రావడమంటే సీఎం రేవంత్‌రెడ్డి తలదించుకోవాలని విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం గల్లీలు, గ్రామాల్లో మద్యం షాపులు పెట్టుకొనేందుకు అనుమతించింది.. మద్యం టెండర్ల మాటున సుమారు రూ. 3 వేల కోట్లు దండుకున్నది’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అభయహస్తంకాదు.. భస్మాసుర హస్తం..
గ్యారెంటీలు, అభయహస్తమని కాంగ్రెస్ ప్రచారం చేసిందని, అది అభయహస్తంకాదని, భస్మాసురహస్తమని హరీశ్ మండిపడ్డారు. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తామని ఐదు లక్షలే ఇచ్చి మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాట్లాడితే రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్.. అంటున్నారని, రాష్ట్రం రైజింగ్ కావడమేందో గాని.. ఆత్మహత్యలు, మర్డర్లు, లైంగికదాడులు మాత్రం రైజింగ్ అయ్యాయని విమర్శించారు. 2023లో 789 మర్డర్లు జరిగితే రేవంత్ పాలనలో 1,245 హత్యలు జరిగాయని చెప్పారు. మహిళలపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని వివరించారు. రైతు ఆత్మహత్యలు 822, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు 179, గురుకుల విద్యార్థుల మరణాలు 116 నమోదయ్యాయని, పెన్షన్ బెనిఫిట్లు రాక 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని, బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని, చివరికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో బీసీ బిడ్డ ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు.
యూరియా కోసం రైతులు, పింఛన్ల కోసం అవ్వాతాతలు, స్కాలర్‌షిప్‌ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, పురుగులన్నం వద్దని గురుకుల విద్యార్థులు, రుణమాఫీ, రైతుబంధు, విత్తనాల కోసం రైతులు, జీతాల కోసం పంచాయతీ సిబ్బంది, ఆశ, అంగన్వాడీ, ఏఎన్ఎం, మధ్యాహ్న భోజన కార్మికులు, డీఏ, పీఆర్సీల కోసం ఉద్యోగులను కూడా కాంగ్రెస్ సర్కారు రోడ్డెక్కించిందని ఫైర్ అయ్యారు. ఫార్మా భూ సేకరణపై లగచర్ల, జహీరాబాద్, ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు లబోదిబోమంటూ జేసీబీలకు అడ్డంపడే దుస్థితి తెచ్చారని నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి రెండేండ్ల విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలని ఎద్దేవాచేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని డబ్బా కొట్టడం తప్ప చేసిందేంటని నిలదీశారు. యంగ్ ఇండియా స్కూళ్ల స్కామ్‌ను త్వరలోనే బయటపెడతామని ప్రకటించారు.
తెలంగాణ పరువు తీసిండ్రు
‘హైదరాబాద్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలువాల్సిన మిస్ వరల్డ్ పోటీలను కాంగ్రెస్ నాయకులు తమ కామవాంఛలు తీర్చుకొనే అడ్డాగా మార్చుకున్నరు.. వాళ్ల చేష్టలతో విశ్వవేదిక సాక్షిగా తెలంగాణ పరువు తీసిండ్రు’ అంటూ హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి అనాలోచిత చర్యలతో ఆర్థిక పరిస్థితి మందగించిందని, రియల్ ఎస్టేట్ నడవడం లేదని, రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైందని, పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకురావడంలేదని చెప్పారు.
అన్నీ బయటకు తీస్తం
సీఎం సన్నిహితుడు రోహిన్‌రెడ్డే తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేశారని మంత్రి కుటుంబీకులే చెప్పారని, ఇప్పటివరకు అరెస్టులు లేవని, గన్ను పెట్టినవారెవరో ? పైసలు పెట్టిన వారెవరో కేసులు లేవని హరీశ్ ధ్వజమెత్తారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్నీ బయటకు తీస్తామని హెచ్చరించారు. ఓ మంత్రి కుమారుడు ఏకంగా బౌన్సర్లను వేసుకుపోయి భూములను కబ్జా పెడుతున్నాడని, నాడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను తయారు చేస్తే, కాంగ్రెస్ వచ్చి క్రైమ్ క్యాపిటల్‌గా మార్చిందని ధ్వజమెత్తారు. విద్యుత్తు, ఇరిగేషన్ శాఖల్లోని అనేక కీలక విభాగాల్లో ఆంధ్రా అధికారులనే నియమించారని హరీశ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటున్నదని, విజయవాడలో కటక ఒత్తితే ఇక్కడ బుగ్గ వెలుగుతున్నదని ఎద్దేవాచేశారు. ఇది ఉద్యమకారులు, అమరులను అవమానించినట్లేనని ధ్వజమెత్తారు.
ప్రజలే ఫుట్‌బాల్ ఆడుతరు..
‘రేవంత్‌రెడ్డి మాట్లాడితే దుబారా గురించి ఉపన్యాసాలిస్తడు. మరిప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో రూ.100 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీసు కడుతున్నరు. క్యాంప్ ఆఫీసుకు తొలుత రూ.10 కోట్లు, సరిపోవడం లేదని రూ.30 కోట్లు, ఆ తర్వాత 70 కోట్లు, ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్లకు పెంచిండ్రు. అది అవసరమా?’ అని నిలదీశారు. పేదవాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే డబ్బుల్లేవు గానీ, క్యాంప్ ఆఫీసులో ఫుట్‌బాల్ సోకుల కోసం రూ.5 కోట్లతో స్టేడియం కట్టారని నిప్పులు చెరిగారు. ‘మెస్సీనో.. గిస్సీనో.. మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తీసుకువచ్చి ఆడటానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ ఆటతో ప్రజలకు ఏం సంబంధం. రాష్ర్టానికి వచ్చేదేంది? ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తవో చెప్పు. లేదంటే ప్రజలే నిన్ను ఫుట్‌బాల్ ఆడుతరు. ప్రజలు నిన్ను ఫుట్‌బాల్ ఆడే సమయం ఎక్కువ దూరం లేదు’ అని నిప్పులు చెరిగారు.
బ్లాక్మెయిల్ రాజకీయం..
ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే కాలేజీలు, ఆరోగ్యశ్రీ బిల్లులడిగితే దవాఖానలకు పోలీసులు, విజిలెన్స్ అధికారులను పంపి యాజ మాన్యాలపై కేసులు పెట్టించిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి అని హరీశ్ ధ్వజమెత్తారు. బిల్లుల కోసం ధర్నా చేసిన చిన్న కాంట్రాక్టర్లను విజిలెన్స్ ఎైంక్వెరీలు..పీఆర్సీ ఇవ్వాలని, వేతనాలు పెం చాలని, బెనిఫిట్స్ మంజూరు చేయాలని, హక్కులు కల్పించాలని అడిగిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు.. ఏక్ పోలీసింగ్ అమలు చేయాలని అడిగిన బెటాలియన్ పోలీసులపై అక్రమ కేసులు బనాయించడమే గాకుండా పోలీసుల భార్యలను వాళ్లతోనే కొట్టించారని, 20 మందిని సస్పెండ్ చేయించారని నిప్పులు చెరిగారు.
18వేల కోట్ల బిల్లుల చెల్లింపులో స్కాం
దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కలెక్షన్ మాత్రం తెలంగాణలో జరుగుతున్నదని, పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు దండుకొని ఎన్నికల ఫండింగ్ కోసం మళ్లిస్తున్నారని హరీశ్ తూర్పారబట్టారు. తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఖజనాలో నిధుల్లేవని సాకు లు చెప్తున్న కాంగ్రెస్ సర్కారు బడా కాంట్రాక్టర్లకు రూ.900 కోట్లు చెల్లించి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం తూట్లు పొడిచిందని విమర్శించారు. పెద్ద కాంట్రాక్టర్లకు రెండేండ్లలో సుమారు రూ.18 వేల కోట్లు అందించడం వెనుక భారీ అవినీతి జరిగిందని సంచలన వి మర్శలు చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్ల బిల్లు లకు గ్రీన్ చానల్..విద్యార్థుల ఫీజులకు మా త్రం డెడ్ చానల్.. రేవంత్‌రెడ్డీ..ఇదేనా నీ ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. ‘కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నది నిజంకాదా? ఇటీవల సీఎల్పీ సమావేశంలో సీఎం ను నిలదీసిం ది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే, ఇక సాధారణ ప్రజలకు ప్రభుత్వంపై ఏం నమ్మకముంటుందని ప్రశ్నించారు.
సబ్బండవర్ణాలకు ధోకా
అధికారంలోకి రాగానే పింఛన్లు రెండింతలు చేస్తామని చెప్పి అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు మొండి చెయ్యి చూపారని హరీశ్ నిప్పులు చెరిగారు. ఆటోడ్రైవర్లకు 12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అందివ్వలేదని, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మీదనైతే సర్కారు పగబట్టిందని, మాట్లాడితే బీఆర్ఎస్ ముద్ర వేస్తున్నదని మండిపడ్డారు. మంత్రి, ముఖ్యమంత్రి మధ్య పంపకాలు, టెండర్లలో తేడా వస్తే చివరికి నిజాయితీ కలిగిన రిజ్వీ లాంటి అధికారి సర్వీస్ నుంచి వైదొలిగారని, ఇది రాష్ర్టానికి నష్టదాయకమని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేండ్లలో జర్నలిస్టులకు కనీసం అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి రెండేండ్లలో కేవలం 6 వేల ఉద్యోగాలే ఇచ్చారని తూర్పారబట్డారు.
డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలని అడిగిన పాపానికి నిరుద్యోగులను లాఠీలతో కొట్టించిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని నిప్పులుచెరిగారు. ‘భట్టి విక్రమార్క దళిత బిడ్డ, సామాజిక స్పృహ ఉన్నదని భావించిన. కానీ, ఆచరణ చూశాక ఆయనా ఒక పెట్టుబడిదారుడని అర్థమవుతున్నది’ అని వాపోయారు. ‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు 20 వేల కోట్లను దారి మళ్లించా రు. అసలు భట్టికి కుర్చీలో కూర్చునే అర్హ త ఉన్నదా? ఎస్సీ, ఎస్టీల నోరు కొట్టిన తర్వాత ఏ విధంగా ఆ కుర్చీలో కూర్చుంటున్నారు?’ అని నిలదీశారు. ‘దళితబంధు పథకం ఉన్నదా? రద్దయిందా? ఎస్సీ కార్పొరేషన్‌తో ఒక్క రూ పాయి అయినా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఎమ్మెల్యే కూ ఏసీడీపీ కింద రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చేవారని, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఈ నిధులను నిలిపివేసిందని విమర్శించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చేందుకు సిఫారసు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 5 కోట్లు ఇస్తామనడం దుర్మార్గమని మండిపడ్డారు.
ప్రజాభవన్‌లో సెటిల్మెంట్లు, విందులు
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిన మొదటి మాటే తుస్సుమన్నదని హరీశ్ విమర్శించారు. ‘బిల్డప్ బాబాయ్ రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడినా అబద్ధమే’ అంటూ చురకలంటించారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు మాత్రమే ప్రజాభవన్‌కు సీఎం వచ్చారని, ఆ తర్వాత అటువైపే చూడలేదని, ఆ తర్వాత ఓ నాలుగైదు రోజులు మంత్రులు వచ్చారని, తర్వాత వాళ్లు కూడా పత్తాలేరని దెప్పిపొడిచారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు గొడుగు నాగరాజు ప్రజాభవన్‌లో పిటిషన్ ఇవ్వగా, సమస్య పరిష్కారమైనట్టు ఆయన మొబైల్ ఫోన్‌కు సమాచారమిచ్చారని, కానీ ఇంత వరకు పరిష్కారంకాలేదని ఉదహరించారు. ప్రజాభవన్ ఎలా పనిచేస్తుందనేందుకు ఇదే తార్కాణంగా నిలుస్తున్నదని చెప్పారు. ప్రజాభవన్ జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని నిప్పులు చెరిగారు.
గ్యారెంటీలు, అభయహస్తమని కాంగ్రెస్ ప్రచారం చేసింది. అది అభయహస్తం కాదు.. భస్మాసురహస్తం. మహిళలను అదానీ, అంబానీలను చేశామని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేసిండు. అదానీ, అంబానీలేమో గాని అప్పులపాలు చేసిండు. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తామని ఐదు లక్షలే ఇచ్చి మహిళలను మోసం చేసిండు. మహాలక్ష్మీ పేరిట ఇవ్వాల్సిన 2,500 ఎవరికైనా ఇచ్చినవా? కోటి మంది అక్కాచెల్లెళ్లకు ఒక్కొక్కరికి 60 వేలు బాకీపడ్డవు. బతుకమ్మ చీర ఒక్కటిచ్చి మిగతావి ఎగబెట్టి మహిళలను అవమాన పరుస్తున్నవు. -హరీశ్‌రావు
బిల్డప్ బాబాయ్ రేవంత్‌రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధమే.. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శకత లేదు.. సెల్ఫ్‌డబ్బా.. పరనింద తప్ప రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదు. ప్రజాదర్బార్ నిర్వహిస్తాం, సామాన్యులు సీఎంను రోజూ కలువొచ్చని మ్యానిఫెస్టో మొదటి పేరాలో పెట్టి ప్రమాణస్వీకారం చేసి గప్పాలు కొట్టిండ్రు. కానీ ఆచరణలో అది తుస్సుమన్నది.
-హరీశ్‌రావు
పూర్తిగా విద్య ఎంతదూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో చూసినం. మార్కులెయ్యడానికి కూడా పైసలు తీసుకుంటున్నరు. రేవంత్ నీకు అవగాహన ఉన్నదా అసలు? జడ్చర్లకు పోతవ్ ఐటీఐని పట్టుకొని ఐఐటీ అంటవ్.. బాసరకు పోతవ్ ట్రిపుల్ ఐటీని పట్టుకొని ఐటీఐ అంటవ్. ఐటీఐకి, ఐఐటీకి, ట్రిపుల్ ఐటీకి తేడా తెల్వని ముఖ్యమంత్రివి దొరికినవ్ మాకు.
-హరీశ్‌రావు
ప్రజాభవన్ ప్రజలకు ఉపయోగపడుతలేదు. జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానాభజానాలు, సంగీత్‌లు, పెండ్లిళ్లు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లకు వేదికగా ప్రజాభవన్‌ను మార్చిండ్రు.
-హరీశ్‌రావు
క్యాంప్ ఆఫీసులో ఫుట్‌బాల్ సోకుల కోసం రూ.5 కోట్లతో స్టేడియం కట్టిండ్రు. మెస్సీనో గిస్సీనో.. మెస్సీతో ఆడతా అని ఆయనను తీసుకువచ్చి ఆడేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నరు. ఆ ఆటతో ప్రజలకు ఏం సంబంధం? వచ్చేదేందీ? ముందు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్. ఆరు గ్యారంటీలు అమలు ఎప్పుడో చెప్పు? లేదంటే ప్రజలే నిన్ను ఫుట్‌బాల్ ఆడుతరు.
-హరీశ్‌రావు
‘ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఇట్ల ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ముందు తెలంగాణలోని పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ కావడం..కమీషన్లు దండుకోవడం.. ఎన్నికల ఫండింగ్‌కు మళ్లించడం రేవంత్ సర్కారుకు అలవాటైంది. దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కలెక్షన్ మాత్రం తెలంగాణలో జరుగుతున్నది.. రాష్ట్ర ఖజానాను రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏటీంగా మార్చిండు.
-హరీశ్‌రావు