(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌ను హైదరా‘బ్యాడ్’గా పత్రికలు పతాక శీర్షికల్లో అభివర్ణించేవి. హైదరాబాద్ అంటేనే కర్ఫ్యూలకు చిరునామాగా పేర్కొనేవి. దశాబ్దాలపాటు ఏటా నగరంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఓ సందర్భంలో బంద్‌లు జరిగేవి. మతసామరస్యానికి ప్రతీకగా చెప్పుకొనే భాగ్యనగరిలో తరచూ మత ఘర్షణలు చోటుచేసుకొనేవి. వీటికితోడు హత్యలు, మారణకాండలు, దోపిడీలు, ఉగ్రదాడులు, దొమ్మీలకు అంతేలేదు. స్వార్ధపూరిత రాజకీయాలు, అసాంఘిక శక్తులను పెంచిపోషించడం, ప్రజా భద్రతమీద చిత్తశుద్ధిలేనితనం, విధానపరమైన వైఫల్యాలు వెరసి కాంగ్రెస్‌పాలనలో తెలంగాణప్రజానీకం అభద్రతలో మగ్గిపోయింది.1978 నుంచి 2014 వరకు (మూడేండ్లు మినహా) మతకలహాలు, బాంబు పేలుళ్లతో హైదరాబాద్ నగరం అట్టుడికిపోయింది. 44 ఏండ్లకాంగ్రెస్ పాలనలో నగరంలో మొత్తంగా 2,703 అల్లర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 554 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,798 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీటికితోడు ఉగ్రవాదుల బాంబు దాడులు, పేలుళ్లతో హైదరాబాద్‌లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. నిఘా వైఫల్యం, సర్కారు ఉదాసీన వైఖరి కారణంగానే లుంబినీ పార్కు, గోకుల్ చాట్, మక్కా మసీద్ వద్ద పేలుళ్లు జరిగినట్టు నివేదికలు తూర్పారబట్టాయి. దీంతో భాగ్యనగరంలో అభివృద్ధి, కంపెనీల రాక అంతంత మాత్రంగానే ఉండేది. బెంగళూరు తదితర నగరాలకు పెట్టుబడులు తరలిపోయేవి.
గత పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో శాంతి, సుస్థిరతలకు చిరునామాగా హైదరాబాద్ నిలిచింది. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ)-2022 నివేదిక తెలంగాణ రాజధానిని సేఫెస్ట్ సిటీగా అభివర్ణించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఏటా 10 లక్షల జనాభాకు సగటున నమోదవుతున్న నేరాల ఆధారంగా ఎన్సీఆర్బీ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో అత్యంత తక్కువ కేసులు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ నిలిచింది. తక్కువ కేసులు నమోదవుతున్న నగరాల జాబితాలో భాగ్యనగరం దక్షిణ భారత్‌లోనే మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో నిలిచింది. నగరంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండటంతో పెట్టుబడులు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. కంపెనీలు నగరానికి క్యూకట్టాయి. ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి వలసలు పెరిగాయి. భూముల విలువ బంగారమైంది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రశాంతతకు చిరునామాగా నిలిచింది. అయితే, ఈ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశమివ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే, నాలుగు దశాబ్దాల పాత గాయాలు మళ్లీ పునరావృతం అవుతాయి. నిబ్బరంగా ఉన్న నగరం భయం నీడలోకి జారిపోతుంది. మత ఘర్షణలు, కర్ఫ్యూలు రాజ్యమేలుతాయి. అల్లర్లతో ఆస్తి, ప్రాణ నష్టం పెద్దఎత్తున సంభవిస్తుంది. భద్రత కరువైన నగరానికి పెట్టుబడులు రానేరావు. హైదరాబాద్ అభివృద్ధికి దూరమై అధఃపాతాళానికి వెళ్తుంది. నగరంలో కొలువుదీరిన గ్లోబల్ కంపెనీలు ఇతర మెట్రో నగరాలకు తరలివెళ్తాయి. ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయి. ఉపాధిలేని నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతాయి. జనావాసాలు తగ్గిపోవడంతో కోట్లు విలువ చేస్తున్న భూముల ధరలు అమాంతం పడిపోతాయి. వ్యాపారాలు దెబ్బతింటాయి. దీంతో తెలంగాణకు ఆర్థిక చోదక శక్తిలా ఉన్న హైదరాబాద్ పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా రాష్ట్రం దివాలా తీసే దుస్థితి దాపురించవచ్చు.
సమైక్య రాష్ట్రంలోనే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, యూపీఏ కూటమి పాలనాపగ్గాలు చేపడుతున్న బీహార్, తమిళనాడులో కూడా నేరాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. క్రైమ్‌రేట్ అధికంగా ఉన్న రాష్ర్టాల టాప్-8 జాబితాలో మూడు రాష్ర్టాలు యూపీఏపాలితాలే. అంతేకాదు.. నేరాలు ఎక్కువగా జరిగే నగరాల్లో కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లోని జైపూర్, బెంగళూరు, చెన్నై, పాట్నా, కోయంబత్తూర్ వంటి నగరాలు ఉన్నాయి.
శాంతి-భద్రతలు అదుపులో ఉన్నప్పుడే సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించగలదు. తెలంగాణ ఏర్పాటైతే తీవ్రవాదులు వచ్చేస్తారని, శాంతిభద్రతలు గతి తప్పుతాయని చాలామంది విష ప్రచారాలు చేశారు. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేసిన ఘనత తెలంగాణ పోలీసులకు దక్కుతుంది. నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడి ప్రజాప్రతినిధులు ‘యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా.. గ్రేటెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా’ అని మనవాళ్లను ప్రశంసించినప్పుడు ఎంతో సంతోషం కలిగింది.
– సీఎం కేసీఆర్
ఎక్కడ చూసినా కర్ఫ్యూలు, మత కల్లోలాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అరాచకాలు నిఘా వైఫల్యంతో లుంబినీ పార్కు, గోకుల్ చాట్, మక్కా మసీద్ వద్ద పేలుళ్లు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు పోకిరీల వేధింపులు.. మార్నింగ్ వాక్‌లకు వెళ్తే మహిళలపై చైన్ స్నాచర్ల దాడులు.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో శాంతిభద్రతలు ఎలాగున్నాయో చెప్పడానికి ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొంటున్నది. అల్లర్లనేవే లేవు. అయితే, ఇప్పుడు ఒక అవకాశమివ్వాలని మళ్లీ కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆదమరిచి పొరపాటు నిర్ణయం తీసుకొన్నామో.. అప్పటి చీకటి, కల్లోల, దోపిడీ రోజులు మళ్లీ తెలంగాణలో నిత్యకృత్యంగా మారుతాయి. జాగ్రత్త!
శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్న చోటే ఉపాధిరంగం విలసిల్లుతుంది. అందుకే హైదరాబాద్‌లో భద్రతను పటిష్టం చేశాం. ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో స్పందించే సాంకేతిక సదుపాయాలను పోలీసు శాఖకు అనుసంధానం చేశాం.
– మంత్రి కేటీఆర్
2014కు ముందు
మత ఘర్షణలతో హైదరాబాద్ తరుచూ ఉలిక్కిపడేది. గడిచిన 44 ఏండ్లలో 2,703 అల్లర్లు జరిగాయి. 554 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,798 మంది గాయపడ్డారు.
2014 తర్వాత
సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టిసారించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఫలితంగా గడిచిన పదేండ్లలో మత కలహాలన్న ముచ్చటే లేకుండా పోయింది.
2014కు ముందు
మహిళలు ఒంటరిగా రోడ్లమీదకు రావాలంటేనే భయపడే దుస్థితి. రోజూ 20దాకా చైన్ స్నాచింగ్‌లు జరుగుతుండేవి. ఏడాదికి 7,500 వరకు చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతుండేవి. నిఘా కోసం అవసరమైన సీసీ కెమెరాల సంఖ్య 350కు మించి ఉండేవి కాదు.
2014 తర్వాత
కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొని చైన్ స్నాచింగ్‌లు అన్నవే లేకుండా చేసింది. చీమ చిటుక్కుమన్నా పోలీసులకు తెలిసేలా నగరవ్యాప్తంగా 8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దేశంలోని మొత్తం సీసీటీవీ కెమెరాల్లో తెలంగాణ వాటా 64 శాతం (10 లక్షల సీసీటీవీలు).
2014కు ముందు
సమస్య గురించి చెప్పాలంటే గతంలో పోలీసుస్టేషన్ గడప తొక్కాల్సిందే. మిస్సింగ్ సర్టిఫికెట్లు కావాలన్నా రోజుల తరబడి వేచిచూస్తూ.. స్టేషన్ చుట్టూ తిరగాల్సిందే.
2014 తర్వాత
డయల్ 100 ద్వారా గరిష్ఠంగా 5 నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొంటున్నారు. ‘హాక్ఐ’ ద్వారా పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తున్నది. లాస్ట్ రిపోర్ట్ యాప్ ద్వారా 72 గంటల్లోనే మిస్సింగ్ సర్టిఫికెట్లపై స్పందిస్తున్నారు.
2014కు ముందు
ఈవ్‌టీజింగ్, దొంగతనాలు, వేధింపులతో కాంగ్రెస్‌పాలనలో మహిళలు అరిగోస పడేవారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లలేక, ఆకతాయిల వేధింపులు భరించలేక ఉద్యోగాలు, ఉన్నత చదువులకు స్వస్తిపలికే దుస్థితి ఉండేది.
2014 తర్వాత
షీటీమ్స్, భరోసా, సఖి, డయల్ 100 ద్వారా మహిళలకు ఆకతాయిల వేధింపుల నుంచి రక్షణ లభించింది. ‘మైక్యాబ్’, ‘ఆటో ఈజ్ సేఫ్’, షీ-షటిల్స్ వంటివాటితో మహిళలకు భద్రతతో కూడిన ప్రయాణం లభిస్తున్నది.
2014కు ముందు
నగరంలో పేకాట క్లబ్బులు, గుడుంబా విక్రయాలు, మట్కా, జూదం, రౌడీయిజం, గూండాయిజం వంటివి కొనసాగేవి. జూదంలో డబ్బులు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డునపడేవి. రెండేండ్లకోసారి ఉగ్రదాడి ఘటనలతో నగరం ఉలిక్కిపడేది.
2014 తర్వాత
వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పేకాట క్లబ్బులను ప్రభుత్వం నిషేధించింది. గుడుంబా విక్రయాలను పూర్తిగా అడ్డుకొని, దానిపై ఆధారపడిన వారికి జీవనోపాధి కల్పించింది. రౌడీలు, గూండాల బెడద లేకుండా చేసింది. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపింది. ఉగ్రదాడులు జరుగకుండా పటిష్ఠ నిఘాను ప్రభుత్వం ముమ్మరం చేసింది.
నా భార్యను కొందరు దుండగులు వెంబడించారు. వాహనాలతో ఆమె కారును ఢీకొట్టి కిందకు దిగాలని ఒత్తిడి చేశారు. ఈ తతంగాన్ని వందల మంది చూసినా ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. బెంగళూరులో మహిళలకు భద్రత కరువైంది.
-కాంగ్రెస్ పాలిత కర్ణాటకకు చెందిన బాధితురాలి భర్త ఆవేదన ఇది
నిమజ్జనం చూసేందుకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. పోకిరీల బెడద ఉంటుందని భయపడ్డాం. అయితే, షీ టీమ్స్ ప్రత్యేక నిఘాపెట్టి 255 మంది ఆకతాయీలను అరెస్టు చేసిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాం. థాంక్యూ.. తెలంగాణ పోలీస్.
– గణేశ్ నిమజ్జనం సందర్భంగా డిగ్రీ కాలేజీ విద్యార్థినుల ప్రశంస ఇది