Peddapur Cheruvu | జూలపల్లి, ఫిబ్రవరి 19: గ్రామాల్లో సాగునీటి కటకట మొదలైంది. రైతుల ఆదరువు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ పెద్ద చెరువు అడుగంటిపోతుండగా, మూడు గ్రామాల్లో వెయ్యి ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోతున్నది. గత కేసీఆర్ సర్కారు ఏటా యాసంగిలో శ్రీరాంసాగర్ జలాలను కాలువల ద్వారా చెరువులు నింపి భరోసా నివ్వగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు చుట్టూ ఉన్న మూడు గ్రామాలకు కల్పవల్లి. దీనికింద పెద్దాపూర్, అబ్బాపూర్, జూలపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉంది. పెద్ద చెరువు కావడంతో రెండు పంటలకూ నీరందించే సామర్థ్యం ఉంది. గతేడాది కేసీఆర్ సర్కారు ప్రత్యేక చొరవ తీసుకొని, శ్రీరాంసాగర్ నీటిని వదిలి కాల్వల ద్వారా పెద్దచెరువు నింపడంతో రైతులకు రంది లేకుండా పోయింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు. జనవరిలో మత్తళ్లు దుంకి పరవళ్లు తొక్కిన ప్రవాహం ఇప్పుడు ముందుకు సాగడం లేదని, పంటల్ని ఎలా దక్కించుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు.
పెద్ద చెరువు దిగువనే పుట్టిన హుస్సేన్మియా వాగు పారకం ప్రశ్నార్థకంగా మారుతున్నది. వానకాలంలో పెద్ద చెరువు నిండిన తర్వాత మత్తడి దుంకిన నీరే ఈ వాగులో ప్రవహించి, మానేరులో కలుస్తుంటుంది. జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలాల రైతులు వాగు ఒడ్డున మోటర్లు పెట్టుకొని వందల ఎకరాల్లో పంట లు పండిస్తున్నారు. ప్రస్తుతం వాగులో చుక్క నీరు లేకపోవడంతో తల్లడిల్లుతున్నారు. నెల క్రితం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దచెరువు నీటి నిల్వలు పరిశీలించారు. ఎస్సారెస్పీ ద్వారా పెద్దచెరువు నింపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చి, పత్తా లేకుండాపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలన్నీ ఎండిపోతాయని రైతులు వాపోతున్నారు.
నేను హుస్సేన్మియా గులో మోటర్ పెట్టుకుని పంటలు పండించుకుంటున్న. పెద్దచెరువులో నీరు తగ్గితే ఎస్సారెస్పీ నీటితో నింపేటోళ్లు. ఇప్పుడు చెరువు ఎండిపోయి రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎస్సారెస్పీ నీటితో చెరువు నింపుతమని ఎమ్మెల్యే విజయరమణారావు చెప్పారు. నెల రోజులు గడిచిన చెరువు నింపలే.
-సంకెండ్ల లక్ష్మణ్, ఆయకట్టు రైతు, పెద్దాపూర్
మా పెద్ద చెరువు వందల ఎకరాల పంటలకు జీవనాధారం. ఎప్పుడూ మత్తడి దూకేది. ఈసారి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నయ్. కనీసం పెట్టుబడులు కూడా చేతికి వస్తయో? రావో తెలుస్తలేదు. పెద్ద చెరువు నింపితే మా సాగు కష్టాలు దూరమైతయ్. వాగుపై ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు సంతోషపడుతరు. పెద్దచెరువు వెంటనే నింపి రైతులను ఆదుకోవాలె.
– పనగట్ల శ్రీకాంత్, రైతు (పెద్దాపూర్)