హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసంఘ్వీ తేల్చిచెప్పారట. రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ, రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టినట్టుగా విశ్వసనీయవర్గాలు తెలిపాయి. న్యాయసలహాలు, ధర్నాలు, కోర్టు కేసులు వంటి చర్యలతో సమయం వృథా చేయడమే తప్ప ప్రయోజనం లేదని స్పష్టంచేసినట్టు సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయకోవిదుల సలహాల కోసమంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్‌బాబు సోమవారం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. వారు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీతో భేటీఅయ్యారు.
ఈ సందర్భంగా సింఘ్వీ పలు కీలకవ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు క్లాస్ పీకినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన పరిమితి(క్యాప్) అమల్లో ఉన్నదని గుర్తు చేశారట. అలాంటప్పుడు తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించినట్టు తెలిసింది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచాలంటే సుప్రీంకోర్టు పెట్టిన క్యాప్‌ను తొలగించాలని, ఇది జరగాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ కావాల్సిందేనని తేల్చిచెప్పినట్టు చర్చ జరుగుతున్నది. ఇవేమీ చేయకుండా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే అది వారిని వంచించడమేనని స్పష్టంచేసినట్లు సమాచారం.
అంతేకాకుండా ‘ఇదంతా మీరు తెలియక చేస్తున్నారా? తెలిసి కూడా రాజకీయం కో సం చేస్తున్నారా?’ అని సింఘ్వీ ప్రశ్నించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నీళ్లు నమలడం మంత్రుల వంతైనట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో కేసులు తేలేవరకు, పార్లమెంట్లో రా జ్యాంగ సవరణ జరిగే వరకు ఈ అంశాన్ని పక్కనపెట్టాలని, లేనిపక్షంలో బీసీలకు ఇంకా అన్యా యం చేసినట్లు అవుతుందని హెచ్చరించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇదంతా డ్రామా అనే విషయం బీసీలకు అర్థమైతే, వారంతా కాం గ్రెస్‌కు వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. ఈ డ్రామాలను కట్టిపెట్టి పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సలహా ఇచ్చినట్టు తెలిసింది.
ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అసాధ్యమని సింఘ్వీ తేల్చిచెప్పడంతో మంత్రుల్లో అంతర్మథనం మొదలైనట్టు సమాచారం. సింఘ్వీతో భేటీ తర్వాత మంత్రులంతా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై అభిషేక్ మనుసింఘ్వీ చెప్పిన విషయాలను మంత్రులు.. కేసీ వేణుగోపాల్‌తో పాటు సీఎంకు వివరించినట్టుగా తెలిసింది. రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు పలు డ్రామాలతో నెట్టుకొచ్చామని, ఇకపై ఆ పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. నష్టమైనా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని, ఈ అంశాన్ని ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీ తర్వాత వెల్లడించాలని భావిస్తున్నట్టు సమాచారం.