హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రెండుసారు నిర్వహించింది. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరుద్యోగులను దగా చేసింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అక్షరాలా 19,017 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 10,395 పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే ఉన్నాయి. మరో 4,000కు పైగా స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో 25 వేలకు పైగా సర్కారు బడులు ఉన్నాయి. ఆయా బడుల్లో మొత్తం 1,25,583 (మంజూరు చేసినవి) పోస్టులున్నాయి. ప్రస్తుతం 1,06,566 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంటే 19,017 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది.
అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ మెగా డీఎస్సీని నిర్వహిస్తామని హామీనిచ్చింది. అధికారంలోకి వచ్చాక 2024 అక్టోబర్లో 10 వేల టీచర్ పోస్టులను భర్తీచేసింది. వీటిలో 6,000 పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కారు హయాంలోనే నోటిఫికేషన్ విడుదలైంది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దుచేసిన కాంగ్రెస్ సర్కారు.. మరో 5,000 పోస్టులను కలిపి 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీటిలో 10 వేల పోస్టులే భర్తీ అయ్యాయి. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. అనేక వివాదాలు పొడచూపాయి.
నిరుద్యోగుల డిమాండ్ మేరకు మరో 6,000 టీచర్ పోస్టులను భర్తీచేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లోనూ 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి పోయి 6 నెలలైనా ఇంతవరకూ డీఎస్సీ ప్రకటన రాలేదు. అదిగో, ఇదిగో అంటూ అభ్యర్థుల్లో ఆశలు రేపింది. డీఎస్సీకి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రెండుసారు నిర్వహించింది. ఈ రెండింటి ఫలితాలను కూడా ప్రకటించింది. టెట్ పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేసింది. కానీ ఇంతవరకు డీఎస్సీ ఊసేలేదు. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయలేదు.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి టీచర్ పోస్టుల భర్తీపై ఊరిస్తూ వస్తున్నది. ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు వైపు మొగ్గుచూపుతూ వస్తున్నారు. దీంతో రెండేండ్లుగా ఎన్రోల్మెంట్ తగ్గుతూ వచ్చింది. ఈ మేరకు మిగులు టీచర్ల సర్దుబాటు కోసం గత జూన్లో జీవో-25ను విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులు టీచర్లను తేల్చి సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ దశలో మంజూరైన పోస్టులను బట్టి ఉన్న పోస్టులను రద్దుచేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తున్నది. దాదాపు 2,000కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సైతం పంపించింది. విద్యార్థుల సంఖ్య మరింత తగ్గితే, భవిష్యత్తులో మరికొన్ని పోస్టులను రద్దుచేసే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అదే తొలి నుంచి ఖాళీలను భర్తీ చేస్తే, విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేదని, ఎందుకు తాత్సారం చేశారని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. మరికొందరు విరమణ పొందారు. వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 5,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. దీన్నిబట్టి కొత్త టీచర్ల అవసరమున్నట్టే. డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులంతా కోచింగ్ సెంటర్లల్లో మగ్గుతున్నా రు. వేలకు వేలు వెచ్చించి విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. వయో పరిమితికి సమీపంలో ఉన్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొత్తగా ఏర్పడిన ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. ఖాళీగా 19వేల పోస్టుల భర్తీకి తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
– దుర్గం హరీశ్, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి