హైదరాబాద్, 19 (నమస్తే తెలంగాణ): ‘మొరటోనికేం తెలుసు..’ సామెత చందంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కాంగ్రెస్ సర్కారుకు తెలియడం లేదు. తెలంగాణ జలధార కాళేశ్వరం కుప్పకూలిందంటూ ప్రచారం చేస్తున్నారే తప్ప.. ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక పురోగతికి ఏ విధంగా దోహద పడిందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ తెలియజేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఒక సందర్భంలో ‘ప్రభుత్వం కాళేశ్వరం కోసం చేసిన అప్పు ఎప్పుడో తీరియిపోయింది’ అని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ నిజమేననే అభిప్రాయాన్ని ఆర్థిక, నీటిపారుదల, వ్యవసాయరంగ నిపుణులు కుండబద్దలు కొట్టి చెప్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు బలోపేతమయ్యాయి. ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. దీంతోపాటు భూముల విలువ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో ఏకంగా రూ. 24.25 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించిందనే అంచనాలున్నాయి. ఇందులో భూముల విలువే రూ. 22.5 లక్షల కోట్లు పెరిగినట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ధాన్యం ఉత్పత్తి విలువ రూ. 1.62 లక్షల కోట్లు పెరగ్గా, కాళేశ్వరం నీళ్లతో పెరిగిన మత్స్య సంపద విలువ రూ. 13,195 కోట్లు. ఈ విధంగా రాష్ట్రంలో ఏ రంగమైనా సరే కాళేశ్వరానికి ముందు, కాళేశ్వరం తర్వాత అనేలా అభివృద్ధి చెందింది.
2014-18 వరకు రూ. 14,100 కోట్ల విలువైన చేపలు ఉత్పత్తి కాగా 2019-2023 వరకు రూ. 27,295 కోట్ల విలువైన సంపద ఉత్పత్తి అయింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుతో పోల్చితే నిర్మాణం తర్వాత రూ. 13,195 కోట్ల విలువైన సంపద పెరిగింది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు రాష్ట్రంలో వ్యవసాయరంగ దుస్థితి వర్ణనాతీతం. తిండి గింజలకు కూడా కష్టంగా ఉండేది. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణ వ్యవసాయరంగం దశ, దిశ పూర్తిగా మారిపోయింది. ఆకలి నుంచి దేశానికి అన్నంపెట్టే స్థాయికి చేరింది. ఇందుకు వరి సాగు, ధాన్యం ఉత్పత్తి వివరాలే నిదర్శనం. 2014 నుంచి 2018 వరకు ఐదేండ్లలో రాష్ట్రంలో 202 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 407 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయింది. దీని విలువ రూ. 63,899 కోట్లు. ఇక 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది.
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎకరం భూమి విలువ సగటున రూ. 5 లక్షలు పలికేది. ప్రస్తుతం ఇది రూ. 20 లక్షలకు పైమాటే. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో సాగునీటి కొరత తీరింది. ఈ నేపథ్యంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 150 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ లెక్కన నాడు 150 లక్షల ఎకరాల విలువ రూ. 7.5 లక్షల కోట్లు. ఇక ఇప్పుడు ఇది రూ. 30 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అనతికాలంలోనే భూముల విలువ రూ. 22.5 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.
ఇక ధాన్యం ఉత్పత్తి అంచనాలకు మించి పెరిగింది. 2019 నుంచి 2023 వరకు 523 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 1127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. దీని విలువ ఏకంగా రూ. 2.26 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 2014-18 వరకు నాలుగేండ్లలో రూ. 63,899 కోట్ల ధాన్యం ఉత్పత్తి కాగా, కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత 2019-23 వరకు నాలుగేండ్లలో రూ. 2,26,056 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి అయింది.
ఈ లెక్కన తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుతో పోల్చితే ప్రాజెక్టు నిర్మాణం తర్వాత రూ. 1,62,157 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి కావడం గమనార్హం. ఇది కాళేశ్వరం సృష్టించిన సంపదే కదా. ఒకప్పుడు మంచినీటి చేపల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపద ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలసిరిని సంతరించుకున్నాయి. దీనికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా నీటి వనరుల్లో చేపపిల్లల్ని విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. 2014-18 వరకు రూ. 14,100 కోట్ల విలువైన చేపలు ఉత్పత్తి కాగా 2019-2023 వరకు రూ. 27,295 కోట్ల విలువైన సంపద ఉత్పత్తి అయింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుతో పోల్చితే నిర్మాణం తర్వాత రూ. 13,195 కోట్ల విలువైన సంపద పెరిగింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పెంచిన సంపదే కదా.
2014-18 వరకు నాలుగేండ్లలో రూ. 63,899 కోట్ల ధాన్యం ఉత్పత్తి కాగా, కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత 2019-23 వరకు నాలుగేండ్లలో రూ. 2,26,056 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి అయింది. ఈ లెక్కన తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుతో పోల్చితే ప్రాజెక్టు నిర్మాణం తర్వాత రూ. 1,62,157 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి కావడం గమనార్హం.