హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో ఆదివారం చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జస్ట్టిస్ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ తదితర నివేదికల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక లోపాలున్నాయని వెల్లడించాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. నివేదికపై చర్చ సందర్భంగా బీజేపీ సైతం సీబీఐకే అందివ్వాలని డిమాండ్ చేసింది.
అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్‌రెడ్డి సైతం అదే నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు జాతీయపార్టీలు ఒకేవిధంగా ముందుకు వెళ్తున్నాయని తేటతెల్లమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే పాట పాడారు. కమిషన్ రిపోర్టు పేరిట ఆద్యంతం బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. నివేదికపై చర్చని చెప్పి ఆ రిపోర్టు కంటే రాజకీయ అంశాలకే పరిమితమయ్యారు. రిపోర్టు సాకుతో నిందారోపణలకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్లు, నిర్మాణం, రుణాలు, కరెంటు బిల్లులు తదితర వాటిపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతగా ఏవైతే ఆరోపణలు చేశారో వాటినే మళ్లీ ఏకరువు పెట్టారు. కంఠశోష తీర్చుకున్నారు. అనంతరం శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిరవధికంగా వాయిదా వేశారు.