హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): డైవర్షన్ పాలిటిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అందులోనూ దిగజారుడుతనాన్ని నిరూపించుకున్నారు. సరిగ్గా బీఆర్ఎస్ అధినేత జగిత్యాల టూర్ ప్లాన్చేసిన రోజే, మేడిగడ్డ పర్యటనకు సిద్ధమైన రేవంత్‌రెడ్డి.. సరిగ్గా కేసీఆర్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడే సమయానికే ఆయన కూడా బహిరంగ సభలో మాట్లాడేలా కుట్రలు పన్నారు. ఇట్లాంటి కుయుక్తులను అలవర్చుకున్న రేవంత్‌రెడ్డి.. గతంలోనూ కేసీఆర్ ‘చలో నల్లగొండ’ సభకు సైతం ఇదే తరహా ఆటంకాలు సృష్టించారు.
కృష్ణా నదీజలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన కేసీఆర్ 2024 ఫిబ్రవరిలో నల్లగొండ సభకు పిలుపునిచ్చారు. దానిపై కుట్రలు పన్నిన రేవంత్‌రెడ్డి సరిగ్గా అదే రోజు అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డ పర్యటనకు వెళ్లారు. ఆ రోజు కూడా కేసీఆర్ మాట్లాడే సమయానికి తాను మాట్లాడేలా ప్లాన్ చేశారు. అయితే, మీడియా మొత్తం కూడా కేసీఆర్ స్పీచ్‌కే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తాజాగా కేసీఆర్ జగిత్యాల టూర్లో అడ్డంకులు సృష్టించేందుకు సీఎం మళ్లీ మేడిగడ్డ టూర్ ప్లాన్ చేశారు.
ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరనున్న సందర్భంగా సోమవారం జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. కేసీఆర్ సభపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డిలో గుబులు మొదలైంది. ఈ క్రమంలో అనూహ్యంగా ముఖ్యమంత్రి మేడిగడ్డ టూర్‌ను ప్లాన్ చేశారు. కాళేశ్వర దర్శనాన్ని మధ్యాహ్నం 3గంటల తర్వాత ప్లాన్ చేశారు. అనంతరం 3:45 గంటలకు మేడిగడ్డ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అకడ డ్యామ్సైట్ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సాయంత్రం 4:35 గంటలకు అంబట్‌పల్లిలోని ఎల్అండ్టీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని, అధికారులతో ప్రాజెక్టుపై సమీక్షిస్తారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు మీడియాతో మాట్లాడుతారు. సాయంత్రం 6:15 గంటలకు కాటారం మండలం నస్తూర్‌పల్లికి చేరుకొని అక్కడి బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు.
సోమవారం సాయంత్రం 4.45గంటలకు ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు కేసీఆర్ బయలుదేరనున్నారు. హెలిప్యాడ్ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి సభా ప్రాంగణానికి కేసీఆర్ బయలుదేరతారు. దాదాపు అటు ఇటుగా 6.15 తర్వాతే కేసీఆర్ స్పీచ్ ప్రారంభం కానున్నది. అయితే, సరిగ్గా అదే సమయానికి రేవంత్‌రెడ్డి నస్తూర్‌పల్లి సభకు చేరుకుంటారు, ఆ 10 నిమిషాలు అటూఇటుగానే స్పీచ్ ప్రారంభిస్తారు. అయితే, సరిగ్గా కేసీఆర్ మాట్లాడే సమయానికే ఆయన స్పీచ్ ప్రారంభించాలనుకోవడం కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.