మరిపెడ, సెప్టెంబర్ 25 : బంజారా జాతిని ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, బంజారా జాతిని విస్మరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ హెచ్చరించారు. లంబాడీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మందితో లంబాడాల ఆత్మగౌరవ సభను గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని కేసీఆర్ గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి రెడ్యానాయక్, మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర హాజరయ్యారు.
ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ.. లంబాడాల ఓట్లతోనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, లగచర్లలో తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం లంబాడాల దృష్టి మళ్లించడానికే ఆదివాసీ ఎమ్మెల్యేలతో సుప్రీంకోర్టులో కేసు వేయించాడని ఆరోపించారు. నిజాం కాలం నుంచి లంబాడాలను గిరిజన తెగగా గుర్తించారని, రాజ్యాంగ బద్ధంగా లంబాడాలు ఎస్టీ జాబితాలో ఉన్నారని, వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. లంబాడాల రిజర్వేషన్లు, హక్కులు, సంక్షేమం కోసం ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. మాజీ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. లంబాడాల రిజర్వేషన్ కోసం ఐక్యంగా నిలిచి, భవిష్యత్తు తరాలకు రక్షణ కల్పించాలని కోరారు.