యైటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్ 5: సింగరేణి పరిరక్షణ కోసం ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో కార్మికులు, కార్మిక సంఘాలను కలుపుకొని ముందుకు సాగుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పష్టంచేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి భవిష్యత్‌ను అంధకారం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి నెట్టుతూ కార్మికులకు జీతాలు చెల్లించలేని స్థితిలోకి తీసుకువచ్చిందని విమర్శించారు.
సింగరేణికి రూ. 56 వేల కోట్ల బకాయిల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నష్టాల్లోకి నెట్టే కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు.రెండేండ్లుగా లాభా ల వాటా నుంచి తీసిన రూ. 6 వేల కోట్లు సైతం సంస్థ అభివృద్ధికి ఖర్చు చేయలేదని విమర్శించారు. ఏడాదికి నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభించిన నైని బ్లాక్‌లో ఆరు నెలలుగా బొగ్గు రవాణా చేయకపోవడం రేవంత్ పనితీరుకు నిదర్శనమని దుయ్యబట్టారు.
కోల్ కారిడార్ రోడ్డు నిర్మించకపోవడంతో బొగ్గును తరలించకుండా ప్రజలు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కమీషన్లు, అనుయాయులకు లాభం చేకూర్చేందుకే సంస్థను ఏటీఎంలా వాడుకుంటున్నారని విమర్శించారు. సంస్థ భవిష్యత్ కోసం కార్మిక సంఘాలు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు అయిలి శ్రీనివాస్, ఎస్ఆర్సీ రెడ్డి, నారాయణరెడ్డి, రాంచరణ్, శంకర్, వెంకట్, రాజు, రాజ్‌కిరణ్, నక్క శ్రీనివాస్, సంజీవరెడ్డి, జీవన్ పాల్గొన్నారు.