బీసీలకు అన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ అంటే రాజకీయాల్లో కేవలం 42 శాతం రిజర్వేషన్లే కాదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాల బిల్లులు పాస్ చేసి ఇంకా జీవో ఇవ్వలేదని తెలిపారు. పార్టీ గుర్తులు లేని ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తమిళనాడు తరహా మినహా మరే మార్గం లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రూ.11 వేల కోట్ల బకాయిలు ఉందని తెలిపారు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతామని తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ప్లాన్ ప్రకారం బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు నిలదీస్తే వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌కు మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. బీసీలకు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ చట్టసవరణతో అవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. గెలిచినవాళ్లనంతా తమవాళ్లే అని చెప్పుకోవడానికే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. బీసీలను కడుపులో పెట్టుకొని కేసీఆర్ చూసుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏనాడు పార్లమెంటులో బీసీ బిల్లుపై మాట్లాడలేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గుర్తుచేశారు. కాంగ్రెస్ తప్పు ఒప్పుకొని బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.