Singareni | గోదావరిఖని, జనవరి 2: సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సభ్యత్వ రుసుం పేరిట ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొదట్లో సభ్యత్వ రుసుం కింద ఒక్కో కార్మికుడి నుంచి నెలకు రూ.10 చొప్పున వసూలు చేసేవారు. ఆ తర్వాత 2017 వరకు నెలకు రూ.20 చొప్పున వసూలు చేశారు. అయితే, ఈ వసూలును 2017లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే కార్మికుల ఖాతా నుంచి నెలకు ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఈ వసూలు పూర్తిగా నిలిచిపోయింది.
సభ్యత్వ రుసుం పేరిట సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కొల్లగొట్టడాన్ని బీఆర్ఎస్ సర్కార్ నిలిపివేయగా.. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వసూళ్లకు అనుమతులు ఇచ్చింది. హస్తం పార్టీ అధికారంలోకి రావడం, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికల్లో గెలుపొందడం, ప్రాతినిధ్య సంఘంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ ఉండటంతో మళ్లీ సభ్యత్వ అంశం తెరపైకి వచ్చింది.
సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ రామగుండం-1, 2, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలో గెలుపొందింది. రామగుండం-3, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాల్లో ప్రాతినిధ్య కార్మిక సంఘంగా గుర్తింపు పొందింది. సింగరేణిలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులు ఉండటంతో మళ్లీ సభ్యత్వ రుసుం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది కార్మికులపై దీని ప్రభావం పడుతుంది. ఒక్కొక్కరి నుంచి రూ.50 చొప్పున నెలకు రూ.20 లక్షలు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు.
సింగరేణి వ్యాప్తంగా సభ్యత్వం నమోదు చేసుకునే అవకాశం గుర్తింపు కార్మిక సంఘానికి ఉంటుంది. ప్రాతినిధ్య కార్మిక సంఘానికి గెలుపొందిన ఆరు ఏరియాల్లో మాత్రమే సభ్యత్వం నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో గుర్తింపు కార్మిక సంఘం 70 శాతం, ప్రాతినిధ్య కార్మిక సంఘం 30 శాతం సభ్యత్వ రుసుం వసూలు చేసుకునే విధంగా రెండు సంఘాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తున్నది. అంటే ప్రతి నెల వసూలయ్యే రూ.20 లక్షల్లో గుర్తింపు సంఘానికి రూ.14 లక్షలు, ప్రాతినిధ్య సంఘానికి రూ.6 లక్షలు దక్కే అవకాశం ఉంది.
సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందిన సంఘాలకు గుర్తింపుపత్రం ఇచ్చిన సెప్టెంబర్ నెల నుంచి కార్మికుల సభ్యత్వ రుసుం వసూలు చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. అంటే ఒక్కో కార్మికుడి ఖాతా నుంచి ఐదు నెలల సభ్యత్వ రుసుం పేరిట రూ.250 ఒకేసారి వసూలు చేయనున్నారు. ఈ ఐదు నెలలకు కలిపి మొత్తం రూ.కోటి వరకు వసూలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకారం గుర్తింపు కాలపరిమితి ముగిసే వరకు ప్రతినెలా కార్మికుడి ఖాతా నుంచి సంబంధిత రుసుం కట్ చేసి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఖాతాల్లో యాజమాన్యం జమ చేస్తుంది.
సింగరేణి కార్మికుల నుంచి సభ్యత్వ రుసుం వసూలు చేయడానికి కార్మికుల అనుమతి, సంతకం తప్పనిసరి. అయితే గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు మాత్రం చాలామంది కార్మికుల సంతకాలను ఫోర్జరీ చేసి యాజమాన్యానికి సమర్పించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సభ్యత్వ రుసుం విషయంలో ఫిర్యాదు చేస్తే గెలిచిన సంఘాలు తమను ఇబ్బంది పెడతాయని భయపడి కార్మికులు మిన్నకుండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కార్మిక సంఘాలు తమకు అనుకూలంగా మలుచుకొని కాసులు దండుకునేందుకు పన్నాగాలు చేస్తున్నాయి.
గతంలో సింగరేణి కార్మికుల సభ్యత్వ రుసుం రూ.10, రూ.20 మాత్రమే వసూలు చేసేవారు. 2017లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ వసూలును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం సరికాదు. నెలకు రూ.50 చొప్పున వసూలు చేయడం అనైతికం. కార్మికుల సంతకాలు లేకుండా వసూలు చేస్తే సహించేది లేదు.
కార్మికుల నుంచి చందాల రూపంలో రూ.200 చొప్పున వసూలు చేసిన డబ్బులను సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఖాతాలో వేయడానికి ముందుకురావడం సబబు కాదు. ముందుగా టెంపుల్ కమిటీ పేరుతో వసూలు చేసిన డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమచేయాలి. అనంతరం కార్మికుల అనుమతి తీసుకొని గుర్తింపు కార్మిక సంఘం తీసుకుంటే బాగుంటుంది. ఇందుకు భిన్నంగా సింగరేణి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొంటూ సొమ్ము తీసుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు