వనపర్తి టౌన్, మే 14 : ధాన్యం కొనే దిక్కులేక అన్నదాతలు అవస్థలు పడుతున్న వేళ అందాల పోటీలు అవసరమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందా ల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపకపోవడం సిగ్గుచేటన్నారు. బుధవారం వనపర్తిలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు కోసం రైతులు ప్రతిరోజూ రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ధాన్యం కాంటా వేయడానికి, మిల్లులకు తరలించడానికి రోజుల తరబడి సమయం పడుతుం దా? అని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్ల లో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ట్రాన్స్పోర్ట్ టెండర్లను పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. వాహనాలు సకాలంలో పంపకపోతే టెండ ర్లు రద్దుచేసేవారని గుర్తుచేశారు. అర్హత లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు టెండర్లు కట్టబెట్టడంతో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. గన్నీబ్యాగుల సరఫరా లేదని, కిందామీదా పడి రైతులు మిల్లులకు ధాన్యం తీసుకువెళ్తే తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు ప్రత్యక్షంగా దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి కొట్టుకుపోతుంటే సర్కారుకు చీమ కుట్టినట్టు అయినా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వరంగల్‌లో పర్యటిస్తున్న అందాల భా మల కాళ్లను తెలంగాణ మహిళతో కడిగించడం యావత్ తెలంగాణ సమాజానికే అవమానకరమని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పాపాలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కా రు తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోళ్లను గాలికొదిలేసి అందాల పోటీలు నిర్వహించ డం అవివేకమని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించినా అందాల పోటీల కోసం చార్మినార్ వద్ద దుకాణాలు మూసివేయించి, క్యాట్‌వాక్‌లు నిర్వహించడంపై మండిపడ్డారు.
అందాల భామల వరంగల్ పర్యటన కోసం అకడి ఫుట్‌పాత్ మీద వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న అభాగ్యుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో అప్పు ల తెలంగాణ అని అవమానించిన కాంగ్రెస్ వారే ఇప్పుడు అడ్డగోలుగా అప్పులు తెచ్చుకుంటూ విచ్చల విడిగా ఖర్చులు చేస్తున్నారని దుయ్యబట్టారు. అందాల పోటీలతో ప్రజల సొమ్ము హారతి కర్పూరంలా ఖర్చు కావడం తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.