Telangana | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అరకొర రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఎగవేత, దిక్కులేని రైతు, పంటల బీమా.. మళ్లీ కరెంట్ కష్టాలు, నీళ్ల గోస.. వీటన్నింటికీ మించి యూరియా కష్టాలు.. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నర ఏలుబడిలోని పరిస్థితి ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ సాయం కరువై ఎవుసం కుప్పకూలింది. మొత్తంగా సర్కారు పాలనా వైఫల్యం అన్నదాతకు శాపంగా మారింది.
రైతులు కలలో కూడా ఊహించని విధంగా మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు కుచ్చుటోపి పెట్టింది. కోతలు, కొర్రీలతో అరకొర రుణమాఫీ చేసి ఎగనామం పెట్టింది. 42 లక్షల మంది రైతులకు రూ. 31వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా 25.35 లక్షల మందికి రూ. 20,616 కోట్లు మాత్రమే మాఫీ చేసిన సర్కారు రుణమాఫీ పూర్తయిందని ప్రకటించింది. 16.65 లక్షల మంది రైతులకు రూ. 10,384 కోట్ల రుణాలను మాఫీ చేయకుండా ఎగనామం పెట్టింది. రూ. 2 లక్షల లోపు రైతులకు అరకొరగా చేయగా రూ. 2 లక్షలకు పైగా రుణం కలిగిన రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టింది.
రైతు ఒకవేళ అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎల్ఐసీకి రూ. 700 కోట్ల రైతుబీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను గోస పెట్టింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వందల మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లింపులను ఎల్ఐసీ నిలిపేసింది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వం మేల్కొని సగం ప్రీమియం చెల్లించినట్టు తెలిసింది.
విక్రయంపై సర్కారు ఉక్కుపాదం మోపింది. పీడీ యాక్టులు నమోదు చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నకిలీ విత్తన మాఫియా మళ్లీ చెలరేగిపోతున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పత్తి, మొక్కజొన్న, వరి నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను ముంచుతున్నది.
ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. కేవలం సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ప్రకటించింది. పోనీ అదైనా రైతులందరికీ సరైన సమయానికి ఇచ్చిందా అంటే అదీ లేదు. మొన్నటి యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు సన్న ధాన్యం విక్రయించి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు రైతులకు బోనస్ చెల్లించలేదు. 4.09 లక్షల మంది రైతులకు రూ. 1160 కోట్లు బాకీ ఉంది. నిరుడు వానకాలం బోనస్ చెల్లింపులోనూ ఇదే తతంగం. రైతులు ధాన్యం విక్రయించిన నాలుగైదు నెలల తర్వాత గానీ బోనస్ చెల్లించడం లేదు.
బీఆర్ఎస్ హయాంలో 24 గంటల పాటు అందించిన ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడే ఆలస్యం అన్నట్టు మాయమైంది. పదేండ్లు కరెంటు కోతలు, వెతలు లేకుండా గడిపిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కోతలు మొదలయ్యాయి. గత సీజన్లో ఐదారు గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదు. కరెంట్ కోతలకు తోడు లో వోల్టేజీ సమస్యలు రైతులను మరింత ఇబ్బంది పెట్టాయి. ట్రాన్స్ఫార్మర్లు, బోరు మోటార్లు కాలిపోయాయి. రైతులు మళ్లీ వర్క్‌షాపుల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతులకు సాగునీళ్ల గోస రావొద్దనే లక్ష్యంతో కేసీఆర్ ఒక్క గోదావరి పైనే 140 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కల్పించారు. కాళేశ్వరంతో నీళ్లు ఎత్తిపోసి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపి యాసంగిలో సైతం మత్తళ్లు దూకేలా చేశారు. కానీ, కాంగ్రెస్ ఏలుబడిలో నీళ్లున్నా రైతులకు గోస తప్పడం లేదు. ఓవైపు కృష్ణా, గోదావరిలో పుష్కలంగా నీళ్లు పారుతున్నా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఒట్టిపోతున్నాయి.
రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కేసీఆర్ చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. కాంగ్రెస్ సర్కారు కాఠిన్యం రైతులను మళ్లీ ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్నది. కాంగ్రెస్ ఏడాదిన్నర ఏలుబడిలో అప్పులపాలైన రైతన్నలు వాటిని తీర్చే మార్గంలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సుమారు 600 మందికిపైగా రైతుల ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2015లో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2019 నాటికి ఈ సంఖ్య 300కు తగ్గింది.
పథకాలను అమలు చేసి రైతులకు ఆసరాగా నిలవడంలో విఫలమైన సర్కారు చివరికి రైతులు సొంత రెక్కల కష్టంతో పండించిన పంటలను కొనుగోలు చేయడంలోనూ విఫలమైంది. పత్తి, ధాన్యం, జొన్నల రైతులు తమ పంటల్ని అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. పంటలు కొనాలంటూ రైతుల రొడ్డెక్కే పరిస్థితి వచ్చింది. సర్కారు సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అడ్డికిపావుసేరు చొప్పున ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మొన్నటి యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రంలో పోసిన రెండు నెలలకు గానీ ధాన్యం కాంట పెట్టలేదు.
తాము అధికారంలోకి వస్తే అన్ని పంటలకు బీమా అమలు చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పంటల బీమా పత్తాలేదు. రైతుల ప్రీమియం కూడా తామే చెల్లిస్తామని మంత్రి తుమ్మల ప్రగల్భాలు పలికారు. రైతుల కోసం రూ. 3వేల కోట్లు ఖర్చు చేయలేక పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించేసింది. ఇక పంట నష్ట పరిహారంలోనూ ఇదే తీరు. గత ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో 51వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రకటించిన సర్కారు పరిహారం కోసం మే 28న రూ. 51.52 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూపాయి కూడా జమకాలేదు.
రైతుబంధును రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్ ఎకరానికి ప్రతియేటా రూ. 15 వేలు ఇస్తామని నమ్మబలికింది. ఆ తర్వాత మాట తప్పిన ప్రభుత్వం దీనిని రూ. 12 వేలకు కుదించింది. ఇది కూడా సరిగా ఇవ్వలేదు. నాలుగు సీజన్లు పూర్తికాగా ఇందులో రెండు సీజన్లు ఎగ్గొట్టింది. 2023 యాసంగిలో బీఆర్ఎస్ సర్కారు జమచేసి పెట్టిన నిధులను పంపిణీ చేసింది. 2024 వానకాలంలో రైతుభరోసా కింద రైతులకు ఒక్క పైసా పంపిణీ చేయలేదు. అదే ఏడాది యాసంగిలో 3 ఎకరాల రైతుల వరకు పంపిణీ చేసి మమ అనిపించింది. దీంతో కాంగ్రెస్ సర్కారుపై రైతుల్లో వ్యతిరేకత ఏర్పడింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో రైతుల వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ వానకాలం సీజన్లో పూర్తి భరోసా అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా కింద రూ. 20వేల కోట్లు ఎగ్గొట్టడం గమనార్హం.