దేవరుప్పుల/పెద్దవంగర్, అక్టోబర్ 3: చెల్లని జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో నిర్వహించిన సమావేశాల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం జరపాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తరచూ వాయిదా వేస్తూ గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో, బీసీలపై మొసలి కన్నీరు కార్చుతూ రాజ్యాంగ బద్ధంకాని జీవో తెచ్చి, వారి మెప్పు పొందేందుకు ఎన్నికల ప్రకటనను తెచ్చిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నేతలకు గెలవమనే క్లారిటీ ఉందని ఎద్దేవా చేశారు. ఈ జీవో చెల్లదని బీసీ సంఘాలు, రాజ్యాంగ నిపుణులు తేల్చి చెబుతున్నా, ప్రభుత్వ పెద్దలు మాట్లాడకపోవడం వెనక వారు ఆడుతున్న డ్రామాలు బయటపడుతున్నాయని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్టీ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికీ చేరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.
సిర్పూర్(టీ), అక్టోబర్ 3: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత భవన్లో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సమక్షంలో సిర్పూర్(టీ) మండలం పారిగాం, మేడిపల్లి, డోర్పల్లి, నవేగాం గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అస్లాంబిన్ అబ్దుల్లా, నాయకులు హీరామన్, లలిత, లక్ష్మణ్ పాల్గొన్నారు.