మణుగూరు టౌన్/పినపాక/కరకగూడెం, ఆగస్టు 24 : కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టంచేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, గత ప్రభుత్వ పథకాల రద్దుకు కుట్రలు పన్నడం సహా అనేక రకాల పాలనా వైఫల్యాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దుచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలను ఎండగడుతూ ఆయా మండలాల్లో ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆయా చోట్ల రేగా మాట్లాడుతూ.. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల హామీలను అమలుచేయడం లేదని విమర్శించారు. పైగా, బీఆర్ఎస్ పథకాలను కొనసాగించకుండా కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ నేతలతోపాటు స్థానిక ఎమ్మెల్యే, ముగ్గురు మంత్రులు కలిసి తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఓ మహిళను అడ్డుపెట్టుకొని తనపై దుష్ప్రచారం చేయించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టించినా చివరకు న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు.