CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెస్తున్నది. అలా గత 3 నెలల్లోనే ఏకంగా రూ.18,100 కోట్ల అప్పులు తెచ్చింది. ఇందులో రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి 9 విడతల్లో రూ.15,100 కోట్లు, హడ్కో నుంచి మరో రూ.3,000 కోట్లు సమీకరించింది. ఆర్బీఐ నుంచి ప్రతి విడతలో రూ.1,000 కోట్లకు తగ్గకుండా నెలకు సగటున రూ.6,000 కోట్లకుపైగా రుణాలు తీసుకొచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.50 వేలకుపైగా అప్పులు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో ఇంత భారీగా రుణాలు తీసుకురావడం రాష్ర్టానికి ఏమాత్రం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా అప్పులు తెచ్చినప్పటికీ ఆ సొమ్మును దేనికి వెచ్చిస్తున్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. రైతు బంధు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయని రేవంత్ సర్కారు.. ఎంతో ఆర్భాటంగా చెప్పుకొంటున్న ‘మహాలక్ష్మి’ (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి) పథకానికీ నిధులు విదల్చడం లేదు. ఈ పథకం అమలు కోసం ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల చొప్పున గత 3 నెలల్లో ఆర్టీసీ యాజమాన్యానికి మొత్తం రూ.900 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కనీసం రూ.100 కోట్లు కూడా విడుదల చేయలేదని అధికారులు వాపోతున్నారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పూర్తిగా అటకెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.