జగిత్యాల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో దశాబ్దకాలంపాటు ప్రగతిపథంలో సాగి, చదువుల వెలుగులు పంచిన విద్యాశాఖ, నేడు సర్వనాశనం అవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ఆయన జగిత్యాలలోని బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. మూడేండ్ల కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2వేల పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు.
గతంతో పోల్చితే 1.26 లక్షల అడ్మిష న్లు తగ్గిపోవడం బాధాకరమని అన్నారు. సర్కార్ నిర్లక్ష్యంతో మూడేండ్ల వ్యవధిలో 107 మంది విద్యార్థులు మృతిచెందినట్టు తెలిపారు. విద్యాలయాలు మరణాలకు కేం ద్రాలుగా మారుతున్నా విద్యా శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌కు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు సోయి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట రూ.28 వేల కోట్లలో రూ.4 వేల కోట్ల కమీషన్ దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టిందని తెలిపారు. జీవో 97కు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు.