అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్‌లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటున్నది.
ఫార్మా క్లస్టర్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఇండస్ట్రియల్ పార్కులు, రీజినల్ రింగ్ రోడ్లు, పారిశ్రామికవాడలు ఇలా
పేరేదైనా ప్రాజెక్టులన్నీ నిరుపేద బక్క రైతులు సాగుచేసుకుంటున్న భూముల్లోనే పడుతున్నాయి. దీంతో
అధికార యంత్రాంగం భూ సేకరణ పేరుతో నిరుపేద కుటుంబాలపై విరుచుకుపడుతున్నది. దశాబ్దాలుగా
అసైన్డ్ భూములనే నమ్ముకొని బతుకుతున్న రైతులు, ఒకటి రెండు ఎకరాల పట్టా భూములున్న సన్న, చిన్నకారు రైతు కుటుంబాలు రాత్రికి రాత్రే రోడ్డున పడుతున్నాయి. తాజాగా మొయినాబాద్ మండలం మేడిపల్లిలో భూ సేకరణ భూతం పంజా విసిరింది.
దాదాపు 50 ఏండ్లుగా రైతు కుటుంబాలు సాగు చేసుకుంటున్న 350 ఎకరాల భూములను సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సర్వే చేసేందుకు అధికారులు గురువారం వెళ్లారు. ఆందోళన చెందిన రైతులు వారిని నిలదీశారు. భూములను ఎందుకు సేకరిస్తున్నారో తమకు తెలియదని సర్వే అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వేను అడ్డుకున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మొయినాబాద్, సెప్టెంబర్ 25: కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు గణనీయం గా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారులోని భూములు బంగారు గనుల్లా మారాయి. కేసీఆర్ హయాంలో భూమి విలువ, ప్రాధాన్యతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టగా, రెండేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ భూములను చెర పట్టేందుకు కంకణం కట్టుకున్నది. పేదల భూములే లక్ష్యంగా ప్రాజెక్టులు ప్రకటిస్తూ రోజుకోచోట అధికారులను సర్వేకు ఉసిగొల్పుతున్నది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల, దుద్యాలతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ, తిమ్మాపూర్‌లో పారిశ్రామికవాడ, ఇదే జిల్లాలో వస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే, మొయినాబాద్ పరిధిలోని ఎన్కేపల్లిలో గోశాల, మంచిర్యాలలో పారిశ్రామికవాడ, భూపాలపల్లి జిల్లా భీమారం మండలం సూరమ్మ చెరువు కుడి కాల్వ, పలిమెలలో సిమెంటు కంపెనీ, సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు, హుస్నాబాద్, అక్కన్నపేటల్లో వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణతో పాటు రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) కోసం భారీ ఎత్తున నిరుపేదల అసైన్డ్, చిన్నకారు రైతుల భూములను బలవంతంగా సేకరిస్తున్నది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన భూసేకరణ ప్రక్రియలో 70-80 శాతం నిరుపేద రైతు కుటుంబాలకు ఇచ్చిన అసైన్డ్, సీలింగ్ భూములే ఉండటం గమనార్హం. ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఈ అసైన్డ్ భూముల్లో దానిని రూపొందించడం, దానిని ఆనుకొని పెద్దలకు చెందిన భారీ ఎత్తున భూములు ఉండటం అనేది సహజంగా మారింది. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేద, పెద్ద అనే తేడా లేకుండా రూపొందిస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెద్దల భూముల్ని తప్పించి సన్న, చిన్నకారు రైతుల భూముల్లో నుంచి అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది.
ఇందులో ‘ముఖ్య’నేత బంధువులతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ నేతల భూములను తప్పించేందుకు అలైన్మెంట్ మార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు అవుటర్ రింగురోడ్డు, ట్రిపుల్ ఆర్‌ను కలిపేందుకు ‘ముఖ్య’నేత బంధువుల భూములకు సమీపంలో నుంచి వెళ్లేలా 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం సేకరించిన 554 ఎకరాల్లోనూ అత్యధిక భాగం అసైన్డ్ భూములే ఉన్నాయి. మిగిలిన దానిలో అన్నీ సన్న, చిన్నకారు రైతులకు చెందిన చిన్న కమతాలే ఉన్నాయి. గతంలో లగచర్ల, దుద్యాల ప్రాంతంలో ఫార్మా క్లస్టర్ కోసం సేకరించిన భూముల్లో అత్యధిక భాగం గిరిజనులు, దళితుల భూములే ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న 567 ఎకరాలు పూర్తిగా గతంలో నిరుపేద రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములే. మంచిర్యాలలో పారిశ్రామికవాడ కోసం హాజీపూర్ మండలం వేంపల్లి, పోచంపాడు గ్రామాల్లో 276 ఎకరాలను సేకరిస్తుండగా, ఇందులోనూ 2009లో వైఎస్ హయాంలో నిరుపేద రైతు కుటుంబాల జీవనోపాధి కోసం ఇచ్చిన అసైన్డ్ భూములే ఉన్నాయి. జగిత్యాల జిల్లా భీమారం మండలంలో సూరమ్మ చెరువు కుడి కాల్వ నిర్మాణం కోసం, భూపాలపల్లిలోని పలిమెలలో సిమెంటు కంపెనీ కోసం సేకరిస్తున్న భూముల్లోనూ రైతులకు చెందిన అర ఎకరం, ఎకరం అసైన్డ్ భూములే ఉన్నాయి.
మొయినాబాద్ పరిధిలో గత కొన్నిరోజులుగా మూడు చోట్ల నిరుపేదలకిచ్చిన అసైన్డ్ భూములను సేకరిస్తుండటంతో రైతు కుటుంబాలు కంటి మీద కనుకు లేకుండా జీవిస్తున్నారు. ఎన్కేపల్లిలో 99.14 ఎకరాల భూములను గోశాల పేరు మీద తీసుకుని ఆ భూములను సాగు చేసుకుని కబ్జాలో ఉన్న కుటుంబాలకు 300 గజాల చొప్పున ప్రొవిజనల్ సర్టిఫికెట్లను రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులు ఈ భూసేకరణను వ్యతిరేకిస్తే పోలీసులను పెట్టి వారిని ఆ భూముల్లోకి రాకుండా అరెస్టులు కూడా చేశారు. ఆ తర్వాత ఇదే మండలంలోని పెద్దమంగళారం రెవెన్యూలో గల సర్వే నంబర్ 218లో 227.35 ఎకరాలు, సర్వే నంబరు 149లో 155.12 ఎకరాలు మొత్తం 373.5 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
ఈ మేరకు ఈ నెల 15న పెద్దమంగళారం మున్సిపల్ వార్డు కార్యాలయం వద్ద చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్ గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. నాటి నుంచి రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా ఈ మండలంలోని మేడిపల్లి గ్రామ రెవెన్యూలోని 58లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 350.36 ఎకరాల భూములను నిరుపేద రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని సేకరించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. 1962లో 90 మంది రైతులకు, 1972, 1973, 1975ల్లో మరో 30 నిరుపేద రైతు కుటుబాలకు ఈ భూమిని లావుణి పట్టాగా పంపిణీ చేశారు.
అప్పటి నుంచి ఆయా కుటుంబాలు వీటినే నమ్ముకొని జీవిస్తున్నాయి. 120 మంది రైతు కుటుంబాల్లో వారి పిల్లలు, మనుమలు, మునిమనుమలు కలిసి ప్రస్తుతం సుమారు 300 కుటుంబాలుగా ఏర్పడ్డాయి. కొంతమంది వారి అసవరాల నిమిత్తం భూములు అమ్ముకోగా 80 శాతం కుంటుంబాలు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఈ భూముల్లో సర్వే చేసేందుకు గురువారం అధికారులు రావడంతో నిరుపేద రైతుల మీద పిడుగుపడినంత పనైంది.
రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే భూములను సర్వే చేయడానికి ఇద్దరు ప్రైవేట్ సర్వేయర్లు గ్రామంలోనికి వచ్చారు. దీంతో ‘భూములు ఎందుకోసం సర్వే చేస్తున్నారు? ఎవరు మిమ్మల్ని పంపించారు?’ అని ప్రశ్నించారు. దీనికి వారు ‘మమ్మల్ని రెవెన్యూ అధికారులు పంపించారు. వెనకాల ఆర్ఐ, ప్రభుత్వ సర్వేయర్ వస్తున్నారు’ అని చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు వచ్చే వరకు భూములను సర్వే చేయవద్దని గ్రామస్థులు స్పష్టం చేశారు. రైతులు అడ్డుకోవడంతో ప్రైవేటు సర్వేయర్లు వెనుతిరిగి పోయారు.