Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తెలిపారు. పేట్ బషీరాబాద్‌లో అక్రమ కేసు చూసి జడ్జి షాకయ్యారని.. వెంటనే బెయిల్ ఇచ్చారని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలు నుంచి శనివారం ఉదయం క్రిశాంక్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులకు థ్యాంక్స్ చెప్పారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ కాంట్రాక్ట్‌లో సీబీఐ విచారణ కోరితే జైలుకు పంపించిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్పై ప్రశ్నించినందుకు మళ్లీ అక్రమ కేసులు మోపారని అన్నారు. మూసీ కాంట్రాక్టును పాకిస్థాన్‌లోకి కంపెనీకి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తే కేసులు పెడుతారని మండిపడ్డారు. ప్రజాపాలన, మొహబ్బత్‌కీ దుకాణ్ అంటున్న కాంగ్రెస్ నాపై అక్రమ కేసులు బనాయించిందని విమర్శించారు.
అప్జల్‌గంజ్, చందానగర్, కరీంనగర్లో ఫైరింగ్ సంఘటనలు జరిగాయని క్రిశాంక్ తెలిపారు. సీసీ సుమతికి రక్షణ లేకుండా పోయిందంటే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడికిపోతోందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సోంబిస్లరీస్ అనే నకిలీ మద్యం కంపెనీ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే రద్దు చేసుకుందని తెలిపారు. రాజ్యాంగం, చట్టం అంటే మాకు నమ్మకం, గౌరవం ఉన్నాయని అన్నారు. సోషల్‌మీడియా తరఫున ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
పోలీసుల విచారణ సందర్భంగా లిస్టులోని పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లను ఎవరివి అని అడిగారని.. దీనితో ఆశ్చర్యపోయానని క్రిశాంక్ తెలిపారు. దీన్నిబట్టి రేవంత్ సర్కార్ తమపై కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని రుజువైందని స్పష్టం చేశారు.