హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్ కత్తిరించడం… బీఆర్ఎస్ సర్కారు పూర్తిచేసిన మురుగునీటి శుద్ధి కేంద్రాలను కొబ్బరికాయ కొట్టడం… కేసీఆర్ హయాంలో డిజైన్ చేసి నిర్మించిన అవుటర్ రింగు రోడ్డు కోకాపేట ట్రంపెడ్ను ప్రారంభించి వాహనదారులకు అందుబాటులోకి తీసుకొనిరావడం… బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన జీసీసీలను (గ్లోబల్ కాపబులిటీ సెంటర్లు) ప్రారంభించడం… ఇదీ గత రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు మచ్చు తునకలు. చివరకు రెండేండ్ల కాంగ్రెస్ పాలనకు చిహ్నంగా వచ్చే నెల అట్టహాసంగా చేపట్టనున్న ‘గ్లోబల్ సమ్మిట్-2025’ నిర్వహణకు కూడా కేసీఆర్ ప్రభుత్వం వేసిన విశాలమైన రహదారులే దిక్కయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీ కోసం ఈ విశాలమైన రహదారులను నిర్మించగా… ఫార్మాసిటీని రద్దు చేసి దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అంటూ కేవలం ఊహానగరాన్ని ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేండ్లలో మీటరు రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. కేసీఆర్ వేసిన రోడ్లకు కనీసం ఈ రెండేండ్లలో మరమ్మతులు చేపట్టిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో అసంపూర్తి రహదారులు… గుంతల రోడ్ల మీదుగానే అంతర్జాతీయ ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్‌కు రానున్నారా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని 19వేల పైచిలుకు ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం 14వేల పైచిలుకు ఎకరాలను సేకరించింది. ఆ భూముల్లో వేలాది గ్రీన్ ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పనను భారీఎత్తున కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. కానీ, రెండేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసింది. అయితే, ఈ రద్దు ద్వారా రైతుల భూముల్ని తిరిగి ఇచ్చి వేయాలనే షరతును అమలుచేయాల్సి ఉన్నందున రైతుల్ని మోసం చేసేందుకు హైకోర్టులో మాత్రం ఫార్మాసిటీని రద్దు చేయలేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిం ది. కానీ, క్షేత్రస్థాయిలో ఫార్మా భూముల్లో ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రెండేండ్లుగా ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టును కేవలం ప్రకటనల్లో చూపుతున్న ప్రభుత్వం ఆ ప్రాంతంలో కనీసం ఒక రోడ్డు వేసి మౌలిక సదుపాయాలను కల్పించిన దాఖలాలు లేవు. ఏడాది కిందట సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీకి శంకుస్థాపన చేసినా, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోకపోగా.. ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. దీంతో రాష్ట్ర ప్రభు త్వం ఒక కొత్త నగరాన్ని ప్రకటించినప్పటికీ, ఫ్యూచర్ సిటీ పరిధిలో రియల్‌బూమ్ వచ్చిందీ లేదు.. పెట్టుబడుల కోసం కంపెనీలు క్యూ కట్టిందీ లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్న సందర్భంగా వచ్చే నెల 8, 9వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్-2025ను చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీనికి ఫ్యూచర్‌సిటీని వేదికగా ప్రకటించింది. మరి ఇంతకీ రెండు సంవత్సరాలు సీఎం, మంత్రులు ప్రకటిస్తున్న… ఏడాది కిందటనే శంకుస్థాపన చేసిన ఫ్యూచర్‌సిటీలో ఇప్పుడు ఏమైనా ఉన్నదా? అని వెళ్లి పరిశీలిస్తే, కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం వేసిన విశాల రహదారులు మినహా అక్కడ ఎలాంటి మౌలిక వసతుల కల్పన లేదు. ఫ్యూచర్‌సిటీకి కేంద్రంగా చెప్తున్న మీర్ఖాన్పేటలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు పనులను చేపట్టింది. ఈ మేరకు అధికారులు అక్కడ యంత్రాలతో భూముల్ని చదును చేస్తున్నారు. అయితే ఈ వేదిక వద్దకు వెళ్లాలంటే నాగార్జునసాగర్, శ్రీశైలం రాష్ట్ర రహదారుల నుంచి అంటే రెండు మార్గాల్లో వెళ్లవచ్చు. ఇందులో నాగార్జునసాగర్ హైవే నుంచి వెళ్లేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఫార్మాసిటీలో భాగంగా యాచారం నుంచి మీర్ఖాన్పేట వరకు సుమారు 15-16 కిలోమీటర్ల మేర రహదారిని డబుల్ రోడ్డు నిర్మాణం కోసం విస్తరించింది. కానీ, రోడ్డు నిర్మాణాన్ని చేపట్టలేదు. రెండేండ్ల కిందట వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీనిపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. దీంతో నాగార్జునసాగర్ హైవే నుంచి వెళ్లాలంటే ఇప్పుడు కూడా గజానికో గుంత ఉన్న మట్టి రోడ్డే శరణ్యం. ఇక శ్రీశైలం హైవే నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని మీర్ఖాన్పేటకు వెళ్లాలంటే ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం వేసిన విశాలమైన రహదారి ఉన్నది. నాలుగు వరుసల్లో అద్భుతమైన వంద ఫీట్ల రహదారి అందుబాటులో ఉన్నది. కాకపోతే మీర్ఖాన్పేట గ్రామ శివారు నుంచి కిలోమీటరు దూరం వరకు మాత్రమే ఈ రోడ్డు ఉన్నది. అంటే గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్దకు వెళ్లాలంటే ఈ రహదారి తర్వాత మరో కిలోమీటరు మట్టి రోడ్డు నిర్మాణం మీదుగా వెళ్లాల్సిందే. అయితే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ నిర్మాణానికి గత రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిర్వహణ బాధ్యతల్ని కూడా చూడలేదు. కొన్నిచోట్ల అక్కడక్కడ భారీ వర్షాలకు చిన్నపాటి మరమ్మతులు చేయాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకానున్న అంతర్జాతీయ ప్రతినిధులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారుల మీదుగానే వేదిక వద్దకు వెళ్లాలేగానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లలో ఫ్యూచర్‌సిటీ కోసం చేపట్టిన కించిత్తు చర్యలు లేకపోవడం గమనార్హం.