హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేక చతికిలబడిన కాంగ్రెస్ సర్కార్.. సొంత రాబడుల పెంపునకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా పన్ను రాబడులతోపాటు పన్నేతర రాబడులను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ప్రజలకు ఎంత భారమైనా ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేయాలని చూస్తున్నది. అందుకోసం కొత్త మార్గాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. నిధుల సమీకరణ కోసం వివిధ శాఖల ఆధీనంలో ఉన్న ఖాళీ భూములను విక్రయించాలని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో జరిగిన రెవెన్యూ మొబిలైజేషన్ సబ్‌కమిటీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. అనంతరం ఆయా భూముల విక్రయానికి విధివిధానాలను రూపొందించాలని హెచ్ఎండీఏని ఆదేశించినట్టు సమాచారం. ఈ భూముల విక్రయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా గతంలో నియమించిన స్టీరింగ్ కమిటీ, అప్రూవల్ కమిటీ, ఆక్షన్ కమిటీలను మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిసింది.
ఇదే జరిగితే ఈసారి అంతర్జాతీయ స్థాయిలో భూముల వేలం ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నది. పారిశ్రామిక భూముల విక్రయంపై గతంలో విపక్షాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈసారి వ్యూహాత్మకంగా ఎటువంటి చిక్కులు రాకుండా హైదరాబాద్‌తోపాటు విలువైన ప్రాంతాల్లోని భూములను విక్రయించి రూ.35 వేల కోట్ల నిధులను సమీకరించుకోవాలని ప్రభుత్వం స్కెచ్ వేస్తున్నది. ప్రస్తుత (2026-27) ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సొంత వనరుల ద్వారా రూ.1,48,165 కోట్లు, పన్నేతర రాబడుల ద్వారా రూ.35,730 కోట్లు రావొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.31,611 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని భావించగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.25 వేల కోట్లే వచ్చాయి. దీంతో ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములను విక్రయించడంతోపాటు భూమి విలువ ఆధారిత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
ప్రస్తుతం ఇంటి అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును లెక్కగడుతున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఆస్తి ఉన్న ప్రాంతంలోని రిజిస్ట్రేషన్ విలువ, నిర్మాణ వ్యయం ఆధారంగా పన్నులను నిర్ధారించనున్నట్టు తెలుస్తున్నది. దీంతో భూమి విలువ ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను భారీగా పెరుగుతుంది. నిధుల సమీకరణలో భాగంగా రిజిస్ట్రేన్ల శాఖ పరిధిలో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు, వాణిజ్య పన్నుల శాఖలో ఓటీఎస్ విధానం అమలుకు ప్రభుత్వ ప్రయత్నిస్తున్నది. దీంతో ఆయా శాఖలు ఇప్పటికే అంతర్గత కసరత్తును ముమ్మరం చేశాయి. సంక్షేమ పథకాల అమలుకు నిధుల లోటు లేకుండా చూసుకోవాలంటే పన్నుల పెంపు తప్పదని సబ్‌కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు నూతన వ్యూహాలను రూపొందిస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ సంస్కరణల వల్ల ఏటా రాష్ట్ర రాబడి రూ.7 వేల కోట్ల మేరకు తగ్గుతున్నది. ఈ ఏడాది ఈ లోటును ఎలాగైనా పూడ్చుకోవాలన్న లక్ష్యంతో అధికారులు పలు వ్యూహాలకు పదును పెడుతున్నారు.