హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): వారంతా ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఉద్యోగులే. 2016 నాటి జీవో 12 ప్రకారం ఆ శాఖ అవసరాల రీత్యా బదిలీ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 80 మంది ఇంజినీర్లు. నిబంధనల సాకుతో వారందరికీ 6 నెలలుగా వేతనాలు, అలవెన్సులు అందడం లేదు. ఫలితంగా ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇన్ని నెలలైనా ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. ఇరిగేషన్, ఆర్థిక శాఖల మధ్య నెలకొన్న నిబంధనల అంశంతో 80 మంది ఇంజినీర్ల కుటుంబాలు నలిగిపోతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిచి బదిలీ చేశారని ఫైనాన్స్ శాఖ మెలికలు పెడుతుండగా, అధికారాలకు లోబడే చేశామని ఇరిగేషన్ శాఖ తేల్చి చెప్తున్నది.
ఇరిగేషన్ శాఖలో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ తదితర వివిధ విభాగాలు ఉన్నాయి. అవసరాల మేరకు సదరు ఇంజినీర్లను ఎక్కడయినా వినియోగించుకునే అవకాశం ఉన్నది. అదీగాక శాఖ పనితీరు కూడా ఆ విధంగానే ఉంటుంది. పనులు కొనసాగుతున్న ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్ల, నిపుణుల అవసరమూ ఉంటుంది. అందుకు అనుగుణంగా 2016లోనే జీవో 12ను ప్రభుత్వం విడుదల చేసింది. నాటి నుంచి ఇటీవల ప్రకారం అవసరాలరీత్యా ఇంజినీర్ల సేవలను శాఖ వినియోగించుకుంటుంది. నిరుటి వరకూ దీనిపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పోయాయి. కానీ గత కొద్దినెలలుగా దీనిపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ ఫైనాన్స్ శాఖ కొర్రీలు పెడుతున్నది.
ఉద్యోగుల వేతనాలను నిలిపేస్తూ వస్తున్నదని బాధిత ఇంజినీర్లు వాపోతున్నారు. ఇరిగేషన్ శాఖలో ఇటీవల పలువురు సీనియర్లు విరమణ పొందారు. కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి అవసరాల రీత్యా ఎస్ఈలను, ఈఈలను, డీఈఈలు కలిపి మొత్తంగా 80 మంది వరకు ఇంజినీర్లను వివిధ ప్రాంతాలను బదిలీ చేశారు. ఈ దశలో వారందిరికీ వేతనాలను చెల్లించేందుకు ఫైనాన్స్ శాఖ మోకాలడ్డుతున్నది. అదేమంటే బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఎలా బదిలీ చేస్తారని? ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ ఆరు నెలలుగా వేతనాలను నిలిపివేసింది.
వాస్తవంగా ప్రభుత్వం నిరుడు వర్షాకాలం ఆరంభంలో శాఖాపరమైన బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే ఆ సమయంలో బదిలీలు చేస్తే వర్షాలు వరద నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశముంటుందనే నేపథ్యంలో ఆ ఉత్తర్వుల నుంచి ఇరిగేషన్ శాఖను ప్రభుత్వం మినహాయించింది. ఆ తర్వాతే అవసరాల రీత్యా పలువురిని ఇరిగేషన్ శాఖ బదిలీ చేసింది. అదీగాక జీవో 12 ప్రకారం ఆ మేరకు క్షేత్రస్థాయి అవసరాలరీత్యా ఇంజినీర్ల సేవలను వినియోగించుకునే అవకాశం ఉన్నదని కూడా ఇరిగేషన్ శాఖ ఉటంకిస్తున్నది. ఇదే విషయాన్ని ఫైనాన్స్ శాఖకు కూడా చాలా స్పష్టంగా చెప్తూ వేతనాలను విడుదల చేయాలని అనేకసార్లు లేఖలు రాసింది. కానీ ఆర్థిక శాఖ అధికారులు మాత్రం అది నిబంధనలకు విరుద్ధమంటూ వేతనాలను విడుదల చేయడంలేదు.
ఆర్థికశాఖ వేతనాలు నిలిపివేసిన విషయాన్ని ఇటీవల జలసౌధకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి దృష్టికి సైతం బాధిత ఇంజినీర్లు తీసుకెళ్లారు. కానీ, రెండు నెలలు దాటుతున్నా ఫలితం కానరాలేదు. ఉద్యోగ విరమణకు మరికొద్ది రోజుల మాత్రమే ఉన్నదని, ఇలాంటి సమయంలో ఈ ఇబ్బందులు ఏమిటని ఓ ఎస్ఈ వాపోతున్నారు. వేతనాలతోపాటు వెహికిల్ అలవెన్స్ కూడా నష్టపోతున్నట్టు ఇంజినీర్లు వాపోతున్నారు.