హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నిధులు లేవనే సాకుతో ఎన్నికల హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు.. సొంత డబ్బా కొట్టుకునేందుకు మాత్రం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలో ప్రభుత్వం ప్రచారానికి భారీగా ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. కేవలం పత్రికల్లో ప్రకటనల కోసమే రూ.133 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వమే వెల్లడించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి 31వరకు ప్రచార ప్రకటనల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వెల్లడించాలని రాజేంద్ర పల్నాటి అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. రూ.133,03,25,741 ఖర్చు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో చిన్న పత్రికలు, మ్యాగజైన్లకు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రూ. 2,86,09, 246, మరోసారి రూ. 68,51, 100 ప్రకటనలు ఇచ్చినట్టు పేర్కొంది. వివిధ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం చిన్న పత్రికలకు రూ.17,60,01,794 కోట్లు వెచ్చించినట్టు స్పష్టంచేసింది. ఇది ప్రింట్ మీడియాలో ప్రచారం కోసం చేసిన ఖర్చు మాత్రమే. ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు హోర్డింగ్లు, బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లు తదితర ప్రచార ప్రకటనల కోసం చేసిన ఖర్చు ఇందుకు అదనం.
అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాం గ్రెస్ హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ గెలిచి 600రోజులు గడిచినా గ్యారంటీలు అ మలుకు నోచుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, వృద్ధాప్య పింఛన్ నెలకు రూ.4000కు పెంపు ఇలా చాలా హామీల అమలు ఊసేలేదు. రాష్ట్రం దివా లా తీసిందని ఓవైపు చెప్తున్న సీఎం రేవంత్.. మరీ ప్రకటనలకు ఇంత ఖర్చు ఏలా చేశారని విమర్శలు వస్తున్నాయి.