Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘అవకాశం దొరికితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టెయ్.. లేదంటే వ్యవహారాన్ని గుట్టుగా కాలరాసెయ్!’ ఇదీ.. సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు వైఖరి. అందుకే ఎనిమిది నెలలుగా చీమ చిటుక్కుమన్నా న్యాయ విచారణ కమిటీలు అంటూ ప్రకటన చేసే ప్రభుత్వ పెద్దలు సుంకిశాలపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముందుగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనంటూ దబాయింపునకు దిగి జలమండలి వివరణతో వెనక్కి తగ్గి.. ఇదేదో తిరిగి సర్కారు మెడకు చుట్టుకుందనే భయంతో జ లమండలి కమిటీతో సరిపెట్టారు. ఒక దశలో కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈఎన్సీతో కలిపి నిపుణుల కమిటీ వేయాలని అనుకున్నా ఈ వ్యవహారాన్ని గుట్టుగా మూసేసేందుకు జలమండలి ఇంజినీర్లతో కమిటీ వేసి చేతులు దులుపుకొన్నది. మరోవైపు పనులను పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లకు ఎలాంటి బాధ్యతా లేనట్టుగా ఏజెన్సీపై నెపం నెట్టి ఆ పాపాన్ని ఆకస్మిక వరదలమీదికి నెట్టారు. చిత్రమైన విషయం ఏమిటంటే ఘటనను ప్రభుత్వానికి చెప్పకుండా దాచిన వారికే విచారణ బాధ్యతలు అప్పగించారు. ఇది కాలయాపనతో గుట్టుగా సుంకిశాల ఎపిసోడ్కు ఫుల్స్టాప్ పెట్టే వ్యూహమేనని నిపుణులు చెబుతున్నారు.
బీఆర్ఎస్పై నెట్టేందుకు తంటాలు పడి..తారుమారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎనిమిది నెలలుగా నానా యాగీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి ఆ ప్రాజెక్టుతోనే గోదావరి జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా వచ్చిపడిన సుంకిశాల ఘటనతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. వాస్తవానికి ఘటన జరిగి వారం రోజులైనా కించిత్తు సమాచారం లేకుం డా ప్రభుత్వం ఒకవిధంగా అంధకారంలోనే ఉండిపోయింది. ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత కలవరపాటుకు గురైన ప్రభుత్వ పెద్దలు, నెపాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేసేందుకు నానా తంటాలు పడ్డారు. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఇది బీఆర్ఎస్ పాపమే’నని ఆరోపించడంతో పాటు కమిటీ వేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇందుకు కొనసాగింపుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ పాపాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంపై వేసేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు.
ఓవైపు సుంకిశాల గోడ కుప్పకూలిన ఘటనపై సామాజిక మాధ్యమా ల్లో వెల్లువెత్తిన విమర్శలను తాళలేక ఈ పథ కం పనులు బీఆర్ఎస్ హయాంలోనే మొదలయ్యాయని పాతమాటలు వల్లించారు. విలేకరుల సమావేశానికి ముందే జలమండలి ఎండీని, ఇంజినీర్లను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఇంజినీర్లు వాస్తవాలను ఆయనకు వివరించినట్టు తెలిసింది. దీంతో ఇదేదో ప్రభుత్వ మెడకే చుట్టుకునేలా ఉన్నదనే భావనతోనే ఆయన విలేకరుల సమావేశంలో నెపా న్ని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేశారు. కానీ జలమండలి అధికారులు మాత్రం డిప్యూటీ సీఎంకు చెప్పిన వాస్తవ వివరాలతోనే అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేయడంతో సీన్ ఒక్కసారిగా తారుమారైంది.
నిపుణల కమిటీపోయి.. జలమండలి కమిటీ..
సుంకిశాల ఘటనపై విచారణ కమిటీ వేస్తామని మంత్రి పొన్నం ప్రకటించిన తర్వాత ప్రభుత్వపరంగా కొంత కసరత్తు జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగం గా నీటిపారుదల శాఖ, జలమండలి అధికారులతో నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరాంతో పాటు జలమండలి ఈడీ సత్యనారాయణ, జేఎన్టీయూకు చెందిన మరో నిపుణుడితో కమిటీ వేయాలని ప్రాథమికంగా అనుకున్నట్టు సమాచారం. కానీ జలమండలి అధికారులు డిప్యూటీ సీఎంను కలవడం, ఆపై అదేరీతిన తాము అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా నిపుణుల కమిటీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సమాచా రం. నిపుణుల కమిటీ అయితే వాస్తవాలను నివేదిక రూపంలో ఇస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని భావించిన పెద్దలు జలమండలి ఇంజినీర్లతో కమిటీ వేసి చేతులు దులుపుకొనేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఈడీ, ఇద్దరు డైరెక్టర్లతో కమిటీ వేశారు. దీనిద్వారా సుంకిశాల కథ కంచికేనని తేటతెల్లమవుతున్నది.
కొత్తగా తేల్చేదేమున్నది?
జలమండలి గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలోనే ఘటనకు కారణమేమిటన్నది పూసగుచ్చినట్టు వివరించింది. కాకపోతే ఆ తప్పిదాన్ని ఏజెన్సీపై నెట్టింది. ముఖ్యంగా పథకం పనులు ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్కు ఇవ్వలేదనే వాస్తవాన్ని ఇంజినీర్లు ఉద్దేశపూర్వకం గా విస్మరిస్తున్నారు. తద్వారా నాన్ ఈపీసీ కింద ఇచ్చిన టెండర్ పనులు కావడంతో పర్యవేక్షణ బాధ్యత జలమండలి ఇంజినీర్లదే. అంటే గేటు బిగింపు, పంపుహౌస్ స్లాబ్ నుంచి టైబీమ్స్ నిర్మాణం మొదలు ఎగువ వరదను అంచనా వేయడం, సొ రంగాన్ని ఓపెన్ చేయడం వరకు ఇంజినీ ర్లు పర్యవేక్షించాలి. ఒక్కో దశను తమ క నుసన్నల్లోనే నిర్ధారిస్తూనే ఏజెన్సీ ముందుకెళ్లాలి.
ఇక్కడ అలా జరిగిందా? లేదా? అనేది కీలకం కాదని, ఏజెన్సీనే అన్ని నిర్ణయాలు తీసుకుంటే మరి ఇంజినీర్లు ఏం చేశారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా వారు తమ విధులను విస్మరించారనేది జలమండలి అధికారిక ప్రకటనలోనే స్పష్టమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి ఇంజినీర్లతోనే కమిటీ వేస్తే కొత్తగా తేల్చేదేమున్నదని? చర్యలు ఎవరిపై తీసుకుంటారని పలువురు రిటైర్డ్ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. పైగా కమిటీలో సుంకిశాల పథకం పనులను పర్యవేక్షించాల్సిన ప్రాజెక్టు డైరెక్టర్ కూడా ఉన్నారని, ఈ క్రమంలో కమిటీ ఆయనకు వ్యతిరేకంగా ఎలా నివేదిక ఇస్తుందనే సందేహాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా గుట్టుగా వ్యవహారాన్ని ముగించేందుకే తప్ప బాధ్యులపై చర్యలకు కాదని స్పష్టం చేస్తున్నారు.