వనపర్తి టౌన్, అక్టోబర్ 5 : కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దమందడి బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో మురిసిపోయిన ప్రజలు.. రెండేళ్ల కాంగ్రెస్ విధ్వంస పాలన చూసి విసిగిపోయినట్టు తెలిపారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రజలను అరిగోస పెడుతున్నాడని విమర్శించారు. నియోజకవర్గంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి మాత్రమే కన్పిస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాగితాలకు పరిమితమైందని ధ్వజమెత్తారు.