నిర్మల్, మే 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర నుంచి ఆంక్షల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. సర్కార్ కార్యక్రమాలు నిర్బంధాల నీడనే అమలవుతున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పర్యటన ఆంక్షల మధ్యే కొనసాగింది. సోమవారం రాత్రి నుంచే నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
మరికొంత మందిని ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్తలు విలాస్, రమాదేవితోపాటు పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్కు కూడా తరలించారు. మంత్రి కార్యక్రమాలు జరిగిన లోకేశ్వరం, బ్రహ్మన్గావ్ల్లోనూ పోలీసు బలగాలను భారీగా మోహరించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.