Rythu Bharosa | హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): గత వానకాలం సీజన్లో రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, యాసంగి సీజన్లో నాలుగెకరాల లోపు రైతులకు పంపిణీ చేసి, మిగతా వారికి రూ. 4 వేల కోట్లు ఎగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అకస్మాత్తుగా రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ వానకాలం సీజన్లో ఆగమేఘాలపై రోజుల వ్యవధిలోనే రైతుభరోసా పంపిణీకి శ్రీకారం చుట్టింది. రెండు రోజుల్లోనే మూడెకరాల రైతులకు పంపిణీ చేసిన సర్కారు తొమ్మిది రోజుల్లో రైతులందరికీ పంపిణీ చేస్తామని ప్రకటించింది. సర్కారుకు అకస్మాత్తుగా తమపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందోనని రైతులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే, పంచాయతీ ఎన్నికల ఎజెండాలో భాగంగానే రైతు భరోసా ఇచ్చి ఉంటుందని చెప్తున్నారు.
రైతులపై ప్రేమ కాదు… ‘ఎన్నికల’ పాచిక
‘ఏ ప్రభుత్వానికైనా రైతు అండగా ఉంటేనే, రైతుల ఆశీర్వాదం బలంగా ఉంటేనే ‘కుర్చీ’ బలంగా ఉంటుంది’.. ఇదీ సోమవారం రైతుభరోసా ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు. రైతుల బలమేంటో ఆయన చెప్పకనే చెప్పారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా రైతుల్లో వ్యతిరేకతపై ప్రభుత్వం ఆందోళనతో ఉన్నది. ఈ క్రమంలో ఎప్పుడూ లేని విధంగా రైతుభరోసా పంపిణీని సాగుకు ముందే ప్రారంభించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల ఓట్ల కోసమే భరోసా పంపిణీ చేస్తున్నదని రైతులే చెప్తున్నారు. రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే గత యాసంగి రైతుభరోసాను పూర్తిగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు వానకాలం భరోసాను ఎందుకు ఎగ్గొట్టిందని నిలదీస్తున్నారు.
‘రైతుభరోసా’కు సర్కారు ధోకా
బీఆర్ఎస్ హయాంలో క్రమం తప్పకుండా పడే రైతుబంధును కాంగ్రెస్ సర్కారు ‘రైతుభరోసా’ పేరుతో అస్తవ్యస్తం చేసిందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం వచ్చీ రాగానే రైతుభరోసాలో కోతలు మొదలయ్యాయి. ఎప్పుడు పడుతుందో, ఎవరికి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎన్నికలప్పుడు రైతుభరోసాను ఎకరానికి రూ. 15వేలు ఇస్తామని ప్రకటించింది. మ్యానిఫెస్టోలోనూ, ఆరు గ్యారెంటీల్లోనూ పొందుపరిచింది. తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసింది. రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చి రూ. 12వేలకు తగ్గించింది. ఈ విధంగా రైతుభరోసాను ఎగ్గొట్టడం, నాట్లప్పుడు వేయాల్సిన పెట్టుబడి సాయాన్ని కోతలప్పుడు వేయడం, కొంతమంది రైతులకే వేయడం, ఎన్నికల హామీని విస్మరించడం వంటి పరిస్థితులతో రైతులు కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ధాన్యం కొనుగోళ్లలోనూ ఇబ్బంది పెట్టడంతో రైతులు మండిపడుతున్నారు.
ఎప్పుడేం జరిగింది?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది(2023-24) డిసెంబర్లో వేయాల్సిన యాసంగి రైతుభరోసాను మే నెలలో పూర్తి చేసింది. ఆ తర్వాతి ఏడాది 2024-25 వానకాలం రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. రైతుబంధులో మార్పులు, మంత్రులు కమిటీలు, అభిప్రాయాల సేకరణ పేరుతో హడావుడి చేసి మొత్తానికి ఎసరు పెట్టింది. తద్వారా కాంగ్రెస్ హామీ ప్రకారం ఆ సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు గానూ ఒక్కో ఎకరానికి రూ. 7,500 చొప్పున రూ. 11,400 కోట్లు ఎగ్గొట్టింది. గత యాసంగి (2024-25)లో ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పింది. మొత్తం రూ. 9,200 కోట్లు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ మూడున్నర ఎకరాల వరకు గల రైతులకు రూ. 5 వేల కోట్లు మాత్రమే పంపిణీ చేసి మిగిలిన రైతులకు రూ. 4,200 కోట్లు ఎగ్గొట్టింది. గత వానకాలం, ఈ యాసంగి కలిపి రైతులకు రైతుభరోసా కింద రూ. 15,600 కోట్లు ఎగ్గొట్టింది. కాగా, వానకాలం రైతుభరోసా పంపిణీలో భాగంగా మంగళవారం మూడెకరాల రైతులకు ప్రభుత్వం నిధులు జమ చేసింది. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రూ. 1551.89 కోట్లు పంపిణీ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు.