నల్లగొండ ప్రతినిధి, జనవరి 20(నమస్తే తెలంగాణ): నల్లగొండ క్లాక్‌టవర్ వేదికగా బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ పెద్దలే పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నట్టు తెలిసిం ది. మంగళవారం నాటి మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17న సాయంత్రమే నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డికి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ దరఖాస్తు చేశా రు. ఇదే విషయమై 18న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కలిసి అనుమతి కోసం విజ్ఞప్తి చేసింది.
మూడ్రోజుల అనంతరం సోమవారం ఉదయం 11 గంట ల తర్వాత రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తూ లేఖ ఇవ్వడం విస్మయం కలిగించింది. ఇందుకు పోలీసులు చూపిన అభ్యంతరాలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రైతుల నుంచి కాంగ్రెస్ సర్కారుపై వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కేటీఆర్ పాల్గొననున్న రైతు మహాధర్నాకు కక్షపూరితంగా అనుమతి ఇవ్వ డం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. న్యాయస్థానాల ద్వారా అనుమతి సాధించి కొంత ఆలస్యమై నా నల్లగొండలో మహాధర్నా నిర్వహించి తీరుతామని స్పష్టంచేశారు.
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఫ్లెక్సీలు, కటౌట్లు ఇతర ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. నల్లగొండ పట్టణవ్యాప్తంగా రైతుధర్నా ఫ్లెక్సీలు వెలిశాయి. వాహనాలు, మైక్ సిస్టం, తాగునీరు, ఇతర సదుపాయాలన్నింటినీ సిద్ధం చేశారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండకు వచ్చిన అనంతరం పోలీసులు అనుమతిని నిరాకరిం చారు. ధర్నా ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లను చూసి మంత్రి కోమటిరెడ్డి జీర్ణించుకోలేక పోయినట్టు తెలిసింది. ఆయనే పోలీసులపై ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆరోపించారు.
నల్లగొండలో కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసులు చూపిన కారణాలు చర్చనీయాంశంగా మారాయి. క్లాక్‌టవర్ సెంటర్ చాలా ఇరుకైన ప్రాంతమని, రద్దీ జంక్షన్ అని, చిన్న రోడ్లు అని, చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉండటంతో రోజంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రోడ్లు లేవని చూపించారు. పక్కనే దర్గా స్థలం, ఎన్జీ కాలేజీ మైదానం అందుబాటులో ఉన్నా వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదంటూ మరోసాకు చూపారు. సంక్రాంతి పండుగ రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతారంటూ తదితర కారణాలను తెరపైకి తెచ్చారు. ఇక చివరగా ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామసభలు ఉన్నాయని, దాంతో పోలీస్ ఫోర్స్ అంతా అటే వెళ్తుందని, ధర్నాకు బందోబస్తు కల్పించలేమని స్పష్టంచేస్తూ అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
కేటీఆర్ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ పేరుతో రైతు మహాధర్నాకు అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం సాయంత్రం విచారించిన కోర్టు డీజీపీని వివరణ కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రభుత్వ గ్రామసభలు, ఈ నెల 26న రిపబ్లిక్ డే ఉన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఇవ్వడం ఇబ్బందికరమని పేర్కొన్నట్టు తెలిసింది. దాంతో హైకోర్టు ఈ పిటిషన్ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 27 తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు రైతు ధర్నా నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.