హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘రైతులు పండించిన అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే (Congress Govt) కొనుగోలు చేస్తుంది. అంతేకాదు, ప్రతి పంటకూ మద్దతు ధరకు అదనంగా బోనస్ (Bonus) కూడా చెల్లిస్తాం’ ..ఇదీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన హామీ. వరంగల్ రైతు డిక్లరేషన్‌లోనూ పంటల కొనుగోళ్లు, బోనస్ అంశాలను కాంగ్రెస్ ప్రముఖంగా ప్రస్తావించింది. తీరా అధికారంలోకి వచ్చాక పంటల కొనుగోళ్లపై చేతులెత్తేసింది. నాడేమో అన్ని పంటలు కొంటామని చెప్పిన సర్కారు.. ఇప్పుడేమో కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ప్రతిపాదనలు పంపుతున్నది. రాష్ట్రంలో పండించిన సోయాబీన్, పెసర, మినుములు కొనుగోలు చేయాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు.
పంటలకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయిస్తుంది కాబట్టి.. అన్ని పంటలను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మక్కజొన్న, పెసర, జొన్న, సోయాబీన్ పంటలను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఇక్కడ రైతులు తమ పంటలను కల్లాల్లో పోసి రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో సర్కారు కొనుగోళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపైనే భారం వేయడం గమనార్హం.
కేంద్రంపై భారం.. కొనుగోళ్లు పక్కకు
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారంగా భావిస్తున్నది. జొన్న, మక్కజొన్న పంటలను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వంపై భారీ మొత్తంలో ఆర్థికభారం పడుతున్నదని మంత్రి తుమ్మల చెప్తున్నారు. ఈ పంటల్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దయతలిస్తేనే పంటలు కొనుగోలు చేసేది. లేదంటే అంతే సంగతి. ఇందులో భాగంగానే ఇటీవల సోయాబీన్, మక్కజొన్న, పెసర కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి చేతులు దులిపేసుకున్నది. కొంటే కేంద్రం కొనాలి.. లేదంటే తమకు సంబంధం లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వర్షాలతో నష్టపోయిన రైతులు.. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా మక్కల కొనుగోళ్లను ప్రారంభించింది. సోయాబీన్ కొనుగోళ్లు మాత్రం కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ప్రారంభించింది. మక్కను కూడా మద్దతు ధరకు అనుగుణంగా కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది.
నాడు గొప్పలు.. నేడు కొనుగోళ్లకే ఎసరు
కాంగెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి పంటకూ మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక బోనస్ సంగతి దేవుడెరుగు.. మద్దతు ధరకు పంటల కొనుగోళ్లకే ఎసరు పెడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యానిఫెస్టోలో 10 పంటలకు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. మద్దతు ధర లేనటువంటి మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు కూడా ధర నిర్ణయించి బోనస్ ఇస్తామని ప్రకటించింది. వరికి రూ.520, మక్కజొన్నకు రూ.530, కందులు రూ.400, సోయాబీన్‌కు రూ.450, పత్తికి రూ.475, జొన్నలకు రూ.292 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పుడు జొన్న, సోయాబీన్ పంటల కొనుగోలును పక్కన పెట్టిన ప్రభుత్వం కేంద్రమే కొనుగోలు చేయాలని వాదిస్తున్నది.