హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): నిషేధిత భూముల జాబితా పేరిట రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల కంటిమీద కునుకే లేకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్.. మరోసారి ప్రజలను అదే ఊబిలోకి నెట్టేసేందుకు మరో జాబితా తెచ్చేందుకు సిద్ధమైంది. మరోసారి నిషేధిత భూముల జాబితాను కొత్తగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాబితా రూపొందించి పంపాలంటూ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేసింది.
కొత్త జాబితా కోసం సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నట్టు తెలిసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త నిషేధిత భూముల జాబితాను సిద్ధంచేసి ఇవ్వాలంటూ హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఒక్కసారి చేసిన తప్పుతోనే కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరి ప్రజలకు పీడ కలను మిగిల్చింది. ఇప్పుడు మరోసారి రూపొందిస్తున్న జాబితాతో ఇంకెన్ని లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేరుతుందో, ఇంకెంత మంది గోస పుచ్చుకుంటుందోననే ఆందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.
తొలి జాబితాతో కల్లోలం
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ 1.01 కోట్ల ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో పట్టా భూములు, ప్రైవేట్ భూములు, ఎలాంటి వివాదాలు లేని భూములను సైతం నిషేధిత జాబితాలోకి నెట్టేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు సైతం ఆ నిషేధిత జాబితాలో పెట్టడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితా రగడ మొదలైంది. భూ యజమానులు లబోదిబోమంటున్నారు. పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఆస్తులపై కాంగ్రెస్ సర్కార్ హక్కులను హరించడంతో బెంబేలెత్తిపోతున్నారు. నేటికీ తమ భూములు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
తెరవెనుక కుట్రకోణం!
ఇప్పటికే ఒకసారి చేసిన తప్పుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు మరోసారి నూతన జాబితా సిద్ధం చేయాలని సర్కార్ నిర్ణయించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. తొలి జాబితాను సరిదిద్దేందుకే ఈ జాబితాను తయారు చేయిస్తున్నట్టు చెప్తున్నప్పటికీ తెరవెనుక మరో కుట్రకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ ప్రత్యక్షంగా కల్పించుకొని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుత నిషేధిత జాబితా కాకుండా మరో కొత్త నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యే నాటికి కొత్త నిషేధిత జాబితాను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించినట్టుగా తెలిసింది.
అధికారుల్లో ఆగ్రహావేశాలు
మరోసారి నిషేధిత భూముల జాబితాను పంపించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘ఇప్పటికే రెండుసార్లు పంపించాం.. ఇంకెన్నిసార్లు పంపించాలి’ అం టూ మండిపడుతున్నారు. కలెక్టర్లు మొదలు.. ఆర్డీవోలు, తహసీల్దార్లు సైతం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. సర్కార్ ప్రజల జీవితాలతోనే కాకుండా తమ జీవితాలతోనూ ఆడుకుంటున్నదని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జాబితాను పదే పదే మార్చడం వల్ల తమకు సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ఒక జాబితాలో ఉన్న భూమి మరో జాబితాలో ఉండటం లేదు, ఒక జాబితాలో లేకపోతే మరో జాబితాలో ఉంటున్నది.
ఇలా కొత్త జాబితా రూపొందించడం వల్ల సమస్య మరింత జఠిలమవుతున్నదని చెప్తున్నారు. జాబితా నుంచి తీసేస్తే ఒక బాధ ఉంటుందని, తీసేయకపోతే మరో బాధ ఉన్నదని వారు పేర్కొంటున్నారు. జాబితా నుంచి తీసేస్తే ఎందుకు తీసేశామో రుజువులు చూపించాల్సి వస్తున్నదని, ఒకవేళ పెడితే ఎందుకు పెట్టామో? చెప్పాల్సి వస్తున్నదని చెప్తున్నారు. ఈ రెండు విధానాలు తమకు సంకట స్థితిని కల్పిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. తొలగిస్తే ఆరోపణలు చేస్తున్నారని, పెడితే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని, ఏం చేయాలో తెలియడం లేదని ఓ తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత భూములకు సంబంధించి ఇంత గొడవ జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని, ఇప్పటికే ఒక విధానం, ఒక పద్ధతంటూ లేదని మండిపడుతున్నారు.
ఫ్రస్ట్రేషన్లో పొంగులేటి.. కలెక్టర్లపై తిట్ల పురాణం
22-ఏ నిషేధిత భూముల జాబితాను ఏదో పొరపాటుగా చేసిన పనికాదని, పక్కా ప్లానింగ్ కుట్రతో చేసిన పని అనే ఆరోపణలున్నాయి. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. తనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి పొంగులేటి తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా తెలిసింది. తన ఫ్రస్ట్రేషన్‌ను అధికారులపై చూపుతున్నట్టుగా అర్థమవుతున్నది.
22ఏ నిషేధిత భూముల జాబితాపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి అధికారులపై బూతు పురాణం లంఘించుకుంటున్నట్టు తెలిసింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లపై ఒంటికాలితో లేస్తున్నట్టు తెలిసింది. చేతకాని వాళ్లు, యూస్‌లెస్ ఫెలోస్ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయి అధికారులపైనే కాదు.. ఏకంగా కలెక్టర్లపైనే తిట్ల దండకం మొదలుపెట్టినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో బూతులు ప్రయోగించినట్టు తెలిసింది. ‘అంతా మీ వల్లే’ అంటూ ప్రభుత్వ తప్పిదాన్ని అధికారులపై నెట్టే ప్రయత్నం చేశారని సమాచారం.
మరో కుట్రకు తెరలేపారా?
కొత్తగా నిషేధిత భూముల జాబితా సిద్ధం చేయాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ భూదాహంలో మరో కుట్రకు తెరలేపారా? అనే అనుమానాలు, ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక్క జాబితాతోనే తీవ్ర ఇబ్బందులు ఎదురైతే, ఇప్పుడు మళ్లీ కొత్త జాబితా సిద్ధం చేస్తున్నారన్న సమాచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ భూమి ఎప్పుడు నిషేధిత జాబితాలో చేరుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. తొలి జాబితాలోనే పట్టా భూములను, ఎలాంటి వివాదంలేని భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. ఇప్పుడు మరో జాబితా అంటే ఇంకెన్ని లక్షల ఎకరాల భూమి ఆ జాబితాలోకి చేరుతుందోననే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దల భూదాహం వల్ల ఏర్పడిన నిషేధిత భూముల జాబితా ప్రజలకు పీడకలను మిగిల్చింది. ఇప్పుడు మరో జాబితాతో ఇంకెంత మందిని ఈ జాబితాలో చేర్చుతుందోననే చర్చ జరుగుతున్నది.
అసెంబ్లీలో పోరుకు సిద్ధమైన బీఆర్ఎస్
అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ సర్కార్‌లో నిషేధిత భూముల జాబితా గుబులు పట్టుకున్నదని తెలిసింది. వారి గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే ఆందోళనలో పెద్దలు ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే లక్షల మంది భూ యజమానుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ప్రభుత్వ నిర్వాకంపై ఇప్పటికే బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. బాధితులకు అండగా నిలిచింది. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సర్కార్‌ను నిలదీసేందుకు సిద్ధమవుతున్నది.