హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావును అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నదా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ‘అవును’ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీశ్‌రావుపై కేసు నమోదైంది. సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జి, అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుపై పోటీ చేసిన అభ్యర్థి ఫిర్యాదు చేయడాన్ని బట్టి ఇది రాజకీయ కుట్ర అని తెలుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. చక్రధర్ ఈ అంశంలో ఓసారి ఫిర్యాదు చేశారని, తీరా హైకోర్టు విచారణకు వెళ్లిన తర్వాత పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని, ఇదే అంశంపై కేసు నమోదు చేయడాన్ని బట్టి ప్రభుత్వం కావాలనే హరీశ్‌రావును ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నదని మండిపడుతున్నారు. హరీశ్‌ను టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేశారని, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని చెప్తున్నారు.
చక్రధర్ తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటూ గతంలోనే హరీశ్‌రావుపై కేసు పెట్టారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారంటూ నిరుడు ఆగస్టు 29న తనకు ఆపిల్ కంపెనీ నుంచి మెయిల్ వచ్చిందని ఈ ఏడాది జూన్ 19న డీజీపీకి ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు పట్టించుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హరీశ్‌రావును ప్రతివాదులుగా చేర్చుతూ జూలై 16న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత నవంబర్ 22న చక్రధర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఇదే అంశంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చక్రధర్‌కు హరీశ్‌పై అనుమానం ఉంటే రిట్ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. హరీశ్‌రావు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ నీతిని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టిన నేపథ్యంలోనే కక్షతో మంగళవారం కొత్తగా కేసు నమోదు చేయించారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీశ్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. రైతులకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి మాట తప్పారని హరీశ్‌రావు ఆగ స్టు 22న యాదగిరిగుట్ట ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెం డో కేసు ఈ ఏడాది అక్టోబర్ 4న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైంది. మంత్రి కొండా సురేఖకు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు నూ లుపోగు దండ వేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీ డియాలో పోస్ట్ పెట్టాడు. నిందితుడి సోషల్ మీ డియాలో హరీశ్ ఫొటో కనిపించిందనే సాకుతో కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మూడో కేసు ఈ ఏడాది అక్టోబర్ 25న బేగంబజార్‌లో నమోదైంది. హామీలను ఎగవేస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ‘ఎగవేతల రేవంత్‌రెడ్డి’ అని సంభోదించినందుకు హరీశ్‌పై కేసు నమోదు చేశారు. నాలుగో కేసు కరీంనగర్లో నవంబర్ 25న నమోదైంది. ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డిని విమర్శించారన్న కారణంతో కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ పాలనా లోపాలను, రేవంత్డ్ నిర్ణయాలతో ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని హరీశ్ ప్రజల ముందు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రేవంత్‌కు హరీశ్ కొరకరాని కొయ్యగా మారారని పేర్కొంటున్నారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, మాట తప్పడంపై హరీశ్‌రావు పదేపదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్‌ను సవాల్ చేయడంతో ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తానని ప్రకటించక తప్పలేదు. అరకొర రుణమాఫీ చేయడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణను ఉదాహరణగా చూపడంతో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చదనే అభిప్రాయం ఆయా రాష్ర్టాల ఓటర్లలో కలిగింది. ఫలితంగా మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్‌లోనే చర్చ నడుస్తున్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఇరుకున పెడుతున్న హరీశ్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని, కేసులు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.