హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంపూర్ణ కులగణన చేపట్టే దిశగా సర్కారు కసరత్తు చేస్తున్నది. ఎస్సీ, బీసీ కులగణన మాత్రమే కాకుండా అన్ని కులాల వివరాలను సేకరించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘాలు, కమిషన్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆయా వర్గాల జనాభా సంఖ్యను తేల్చేందుకు రెండు వేర్వేరు సర్వేలు చేపట్టే బదులు, మొత్తంగా కులగణన చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వ ఉన్నది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సచివాలయంలోని ఆయన చాంబర్లో మంగళవారం సమావేశం జరిగింది.
ఇందులో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితారామచంద్రన్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, లా సెక్రటరీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులగణనపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఇప్పటికే బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన ఎలా చేశారు? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు? ఆయా రాష్ట్రాల్లో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించారు? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు.
కర్ణాటకలో బీసీ కమిషన్ ద్వారా, బీహార్‌లో జీఏడీ ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సర్వేచేసిన తీరుపై చర్చ జరిగింది. ఈ మూడు రాష్ట్రాల్లోని మంచి పాలసీని తీసుకొని తెలంగాణలో అమలుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
మరోవైపు ఎస్సీ వర్గీకరణకు కులగణన సర్వే నివేదిక అవసరమున్నందున, పూర్తిస్థాయిలో సమగ్రంగా కులగణన చేపట్టాలని, ఇందుకు అవసరమైన వివరాలను ఏవిధంగా సేకరించాలనే అంశంపై సమాలోచనలు చేశారు. కులగణన నివేదిక పారదర్శకంగా రూపొందించేందుకు బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలకు సంబంధం లేకుండా జీఏడీ లేదా పంచాయతీరాజ్ లేదా రెవెన్యూ శాఖలకు ఆ బాధ్యతను అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చించారు.
దీనిపై సమగ్రంగా చర్చించేందుకు రెండు, మూడు రోజుల్లో సీనియర్ మంత్రులతో కీలక సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కుల గణన ప్రక్రియను సీనియర్ ఐఏస్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని, కులగణన ప్రారంభించిన తర్వాత నెలలోగా పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.