హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ‘67,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. ఉద్యోగాల భర్తీలో మాదే రికార్డు’ అంటూ గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు బుధవారం బట్టబయలైంది. అసెంబ్లీ సాక్షిగా వాస్తవ విషయాన్ని స్వయంగా ఆ ప్రభుత్వమే ఒప్పుకొన్నది. ఇప్పటివరకు తమ ప్రభు త్వం కేవలం 16,978 ఉద్యోగాలను మాత్రమే భర్తీచేసినట్టు గణాంకాలు సహా వెల్లడించింది. తాము భర్తీ చేశామని చెప్పుకొంటున్న వాటిలో 50,785 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనివేనని సమాధానమిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారకరామారావు, కేపీ వివేకానంద్, పట్లోల్ల సబితాఇంద్రారెడ్డి, అనిల్ జాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలను సంధించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు జారీచేశారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసినవి కాకుండా ప్రస్తుత ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీచేశారు? నిరుద్యోగులకు నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి హామీ అమలుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? ప్రభు త్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమల్లో ఉన్నదా? అన్న అంశాలపై వారు ప్రశ్నలు సం ధించారు. అయితే ఆ ప్రశ్నలు సభలో చర్చకు రాలేదు. కానీ, ఆయా అంశాలపై మాత్రం ప్రభుత్వం సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 67,763 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లతో భర్తీ అయినవి 16,978 ఉద్యోగాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీచేసిన నోటిఫికేషన్ల ద్వారా భర్తీ అయిన పోస్టులు 50,785 అని ప్ర భుత్వం లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్న ది. దీంతో 67 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ భర్తీ చేసిందన్నది ఉత్తమాటేనని తేలిపోయింది.
ఇచ్చిన నోటిఫికేషన్లు పదహారే..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కేవలం 16 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చినట్టు సర్కార్ ఒప్పుకొన్నది. ఆ నోటిఫికేషన్ల ద్వారా 31,798 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తే, వీటిలో 16,978 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని అసెంబ్లీలో ప్రకటించింది. వీటిల్లో గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన మరో రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి. గత సర్కార్ 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన గ్రూప్-1కు మరో 60 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులకు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ స్థానంలో మరో 5,973 పోస్టులను కలిపి 11 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేసింది. మొత్తం 5,592 పోస్టులు కూడా కేసీఆర్ సర్కార్ ఖాతాలోనివే. అంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు 11,386 మాత్రమే అవుతుంది. 4 వేల నిరుద్యోగ భృతి పరిశీలనలో ఉందని చెప్పింది.
రెండేండ్లుగా క్రెడిట్ చోరీ
ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ గత రెండేండ్లుగా క్రెడిట్ చోరీకి పాల్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలను తాము భర్తీ చేసిన ఉద్యోగాలుగా చెప్పుకొన్నది. కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేసినట్టు చెప్పుకొంటున్న అనేక నోటిఫికేషన్లు 2022, 2023లో వచ్చినవే. వీటిలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 సహా పలు పరీక్షలను బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే నిర్వహించారు. పరీక్షలు సైతం గత ప్రభుత్వమే నిర్వహించింది. కేవలం ఫలితాలనే విడుదల చేసిన ఈ సర్కార్ గొప్పలు చెప్పుకొన్నది. ఉద్యోగాల భర్తీలో కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోగా, న్యాయస్థానాల్లో చిక్కుముడులు వీడటంతో ఇప్పుడు నియామక పత్రాలిచ్చి తామే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ సర్కార్ పోజులు కొట్టింది. కాంగ్రెస్ ఈ ఏడాది కాలంలో ఉద్యోగాలను భర్తీచేసే అతి పెద్ద సంస్థ అయిన టీజీపీఎస్సీ నుంచి ఒక్క కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. గురుకుల, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. ఒక్క మెడికల్ రిక్రూట్‌మెంట్‌బోర్డు ద్వారా మాత్రమే.. అదికూడా పరిమితంగా కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇ చ్చింది. పాత నోటిఫికేషన్లకు కొత్త పోస్టులు కలిపి తామే ఇచ్చామని గొప్పలు చెప్పింది. ఆలస్యంగానైనా అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలను బయటపెట్టిందని, నిరుద్యోగ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.
ఇన్నాళ్లూ మోసగించిండ్రు : గెల్లు శ్రీనివాస్
67వేల ఉద్యోగాల భర్తీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఇన్నాళ్లూ నిరుద్యోగులను దారుణంగా వంచించింది. ఆలస్యంగానైనా నిజాలను బయటపెట్టింది. ఈ ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్పుకొంటున్న ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలకు ఆర్థిక ఆమోదం తెలిపింది.. అన్న వివరాలను నోటిఫికేషన్ తేదీలు సహా బయటపెట్టాలి.