‘ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములను అమ్ముతున్నది. భావి అవసరాలకు స్థలం అనేది ఉంచకుండా ఇష్టం వచ్చినట్టు భూములు వేలం వేయడం ఏమిటి? మేం అధికారంలోకి వచ్చాక భూముల వేలాన్ని రద్దు చేస్తాం. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తాం.’
-అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట ఇది.
కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ భూముల అమ్మకం మరింత తీవ్రమైంది. మల్టీయూజ్ జోన్లకు మినహాయింపులేదు! లంగ్ స్పేస్‌కు లెక్కేలేదు! పారిశ్రామిక భూములనూ వదిలిపెట్టట్లేదు. ఎక్కడ జాగ కనిపించినా ఎడాపెడా అమ్మేయడమే!
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రజాధనాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా నగరంలోని విలువైన పారిశ్రామిక వాడల భూములపై వారి కన్ను పడింది. హైదరాబాద్ పరిధిలోని ఈ భూములను రియల్ ఎస్టేట్ సహా ఇతర అవసరాలకు వినియోగించేందుకు సిద్ధమైంది. పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తే ఆ కేటాయింపు రద్దవుతుందన్న నిబంధనలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా భూ వినియోగ మార్పిడికి పావులు కదుపుతున్నది. పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా ‘హిల్టప్’ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ) పేరుతో ఓ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని వెనుక పెద్ద మతలబు ఉన్నదని, రూ.వేల కోట్లు దోచుకునే ప్లాన్ వేశారని పారిశ్రామిక వేత్తల్లో చర్చ జరుగుతున్నది.
పెట్టుబడులు, పరిశ్రమలు రావాలనే లక్ష్యంతో 50-60 ఏండ్ల కిందట ప్రభుత్వం సబ్సిడీ ధరలకు పరిశ్రమలకు భూములను కేటాయించింది. దీంతో అప్పట్లో నగర శివారు ప్రాంతాలుగా ఉన్న 22చోట్ల పారిశ్రామికవాడలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో నగరం వేగంగా విస్తరించడంతో అప్పట్లో శివారు ప్రాంతాలుగా ఉన్న పారిశ్రామికవాడల చుట్టూ ఇప్పుడు జనావాసాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఏమాత్రం ధర పలకని భూములు ఇప్పుడు రూ.పదుల కోట్లు పలుకుతున్నాయి. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో చాలావరకు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. టెక్నాలజీ మారడం వల్ల చాలా పరిశ్రమలు ఖాయిలా పడగా, అనేక పరిశ్రమలు మార్కెట్ పోటీని తట్టుకోలేక మూతబడ్డాయి. దీంతోపాటు ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న పారిశ్రామికవాడలను ఔటర్ వెలుపలికి తరలించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఔటర్ వెలుపల పలు పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసి నగరంలోని పరిశ్రమలకు సబ్సిడీ ధరలకు అక్కడ భూములు కేటాయించారు. ఇలా నగరంలోని పారిశ్రామిక వాడలకు చెందిన వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములపై ప్రభుత్వం దృష్టిపడింది. ఈ భూములను మల్లీయూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నది.
సబ్సిడీ ధరలకు కేటాయించిన భూములను లీజు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడమో, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం వారివద్ద ధర వసూలు చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించడమో చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ‘హిల్టప్’లో భాగంగా రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం ఫీజుగా వసూలుచేసి వారికి భూ వినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఉదాహరణకు గతంలో ఒక పరిశ్రమకు గజం భూమికి రూ.10 చొప్పున ధర నిర్ణయించి వారికి కేటాయించగా, ఇప్పుడు చదరపు గజం భూమి రూ.లక్ష దాటిపోయింది. రిజిస్ట్రేషన్ విలువ మాత్రం రూ.20-30వేలు మాత్రమే ఉన్నది. హిల్టప్ విధానం ప్రకారం సదరు పరిశ్రమల నిర్వాహకులు తమ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలంటే రిజిస్ట్రేషన్ విలువలో 30శాతం చెల్లిస్తే సరిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ విలువ రూ.20-30వేలు ఉన్నచోట రూ.6-9 వేలు చెల్లిస్తే సరిపోతుంది. రూ.లక్ష ఉన్న భూమిపై హక్కులు పొంది దర్జాగా ఎవరికైనా డెవలపర్‌కు ఇచ్చుకోవచ్చు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఎవరైనా లేఔట్లు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే అధికారులు వారిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ ప్రతినిధులుగా చెలామణీ అవుతూ పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ అపార్ట్మెంటు నిర్మించాలంటే చదరపు అడుగుకు చొప్పున డబ్బుగానీ, ఫ్లాట్లుగానీ సమర్పించుకుంటే తప్ప అనుమతులు రావడంలేదనే వాదన ఉన్నది. బిల్డర్లు, రియల్టర్ల నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమల భూములను సులభంగా కన్వర్షన్ చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కూడా కచ్చితంగా అన్ని స్థాయిల్లో పర్సంటేజీ వసూలు చేస్తారని, రూ.వందల కోట్ల విలువైన భూములను తమకు నచ్చిన వ్యక్తులకే అప్పగించేలా ఒప్పందాలు జరుగుతాయని డెవలపర్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా రూ.వేల కోట్లు కొల్లగొట్టే పకడ్బందీ వ్యూహంతోనే హిల్టప్ను తెరపైకి తెచ్చారని చెప్తున్నారు. మరోవైపు, గతంలో కొందరు పారిశ్రామికవాడల్లో భూములను ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్ర ధర ప్రకారం కొనుగోలు చేయగా, మరికొందరు ప్రభుత్వం వద్ద లీజుకు పొందారు.
ఈ లీజుదారులు కాలక్రమంలో వాటిని సబ్-లీజులకు ఇచ్చి తప్పుకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఒకరి పేరు ఉండగా, కబ్జాలో మరొకరు ఉన్నారు. ఇటువంటివాటి విషయంలో యాజమాన్య హక్కులపై స్పష్టత లేదు. కొందరు సబ్-లీజుదారులు ఖాళీ చేయకుండా మొండికేయడంతో అసలు లీజుదారులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇటువంటి వివాదాలు అనేకం న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇటువంటి భూములు ప్రస్తుతం ప్రభుత్వ ప్రతినిధులుగా చలామణీ అవుతున్న కొందరు ప్రైవేటు వ్యక్తులకు కాసులు కురిపిస్తాయని చెబుతున్నారు. సెటిల్మెంట్ల పేరుతో లీజుదారుని, సబ్-లీజుదారిని పక్కకు తప్పించి మూడో వ్యక్తికి బదలాయించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద 9వేల ఎకరాలతో రూ.వేల కోట్లు వెనుకేసుకునే అవకాశం ఉన్నదని, ఇదో పెద్ద కుంభకోణంగా మారే ఆస్కారమున్నదని చర్చ జరుగుతున్నది.
నగరంలోని మొత్తం 22 పారిశ్రామికవాడల్లో 9292.53ఎకరాల భూమి ఉన్నది. నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, మౌలాలీ, ఉప్పల్, కూకట్పల్లి, ఐపీ జీడిమెట్ల, ఎస్‌వీసీఐఈ జీడిమెట్ల, ఐపీ బాలానగర్, టీఐఈ బాలానగర్, ఎస్‌వీసీఐఈ బాలానగర్, ఐపీ సనత్‌నగర్, ఐపీ మేడ్చల్, కుషాయిగూడ, సీఐఈ గాంధీనగర్, పటాన్చెరు, ఐడీఏ పాశమైలారం, రామచంద్రాపురం, కాటేదాన్, హయాత్‌నగర్, స్టాండ్ ఎలోన్ ట్యాండ్స్, చందూలాల్ బారాదరీ తదితర పారిశ్రామికవాడల్లో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.