జగిత్యాల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదరోగుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రరూపం దాల్చడమే ఇందుకు కారణంగా నిలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20నెలలు దాటగా పదిహేడు నెలల నుంచి దవాఖానలకు మందుల బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం నిలిపివేసింది. కోట్లల్లో బకాయిలు ఉండడంతో ఫార్మ డిస్ట్రిబ్యూటరీలు పంపిణీని నిలిపివేసినట్టు తెలిసింది. జిల్లా ప్రధాన దవాఖానల సూపరింటెండెంట్లు స్థానిక డిస్ట్రిబ్యూటరీల నుంచి తాత్కాలిక పద్ధతిలో మందులను కొనుగోలు చేస్తూ సేవలు నెట్టుకొస్తున్నారు. స్థానిక మెడికల్ డిస్ట్రిబ్యూటర్లకు సైతం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నా రు. మెడికల్ డిస్ట్రిబ్యూటరీలు కూడా మం దులు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దవాఖానలకు మందుల పంపిణీ వ్యవస్థ సక్రమంగా నడిచింది. జిల్లా ప్రధాన హాస్పిటళ్లకు ప్రభుత్వమే దాదాపు మందులన్నీ నేరుగా పంపిణీ చేసింది. ఎప్పుడైనా ఏవైనా మందుల కొరత ఏర్పడితే టెండర్ పొందిన ప్రైవేట్ ఫార్మా, సర్జికల్ డిస్ట్రిబ్యూటరీల నుంచి జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్లు ఇండెంట్ పెట్టి తెప్పించుకొనేవారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దవాఖానల్లో మందులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సర్కార్ నుంచి నేరుగా వచ్చే మందులు తగ్గిపోయాయి. దీంతో టెండర్ పొందిన ప్రైవేట్ ఫార్మా, సర్జికల్ డిస్ట్రిబ్యూటరీల నుంచి సూపరింటెండెంట్లు ఇండెంట్ పెట్టి మందులు, శస్త్ర చికిత్స పరికరాలు తెప్పించుకొని వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. 16నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఫార్మా డిస్ట్రిబ్యూటరీలకు నిధుల మంజూరును నిలిపివేయడంతో డిస్ట్రిబ్యూటరీలు ముఖం చాటేశారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లాకు సంబంధించి.. హైదరాబాద్ బేస్డ్గా ఉన్న రెండు ప్రధాన ఫార్మాకంపెనీలతోపాటు కరీంనగర్‌లోని రెండు ప్రైవేట్ ఫార్మా కంపెనీలు టెండర్లు పొంది.. మందులు, ఆపరేషన్ కిట్లు పంపిణీ చేస్తూ వచ్చాయి. ప్రభుత్వం డబ్బులు చెల్లించనిదే మందులను పంపిణీ చేయబోమంటూ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తేల్చిచెప్పింది.
ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో టెండర్‌దారులు మందులు, సర్జికల్ కిట్లు, వైద్య సామగ్రి పంపిణీని నిలిపివేశారు. దీంతో ఏడాదిగా జిల్లాల్లోలని ప్రధాన దవాఖానల సూపరింటెండెంట్లు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి, అత్యవసరమైన మందులు, సామగ్రిని జిల్లా కేంద్రాల్లో ఉండే లోకల్ ఫార్మా, మెడికల్ డిస్ట్రిబ్యూటరీల నుంచి కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని లోకల్ డిస్ట్రిబ్యూటరీలకు సూపరింటెండెంట్లు, జిల్లా ఉన్నతాధికారులు చెప్పారు. కొన్ని చోట్ల కలెక్ట ర్లు, సూపరింటెండెంట్లు తమ పరిధిలోని కొన్ని నిధులను చెల్లించారు. ఇప్పుడు లోకల్ డిస్ట్రిబ్యూటరీలకు కూడా బకాయిలు భారీగా పేరుకోవడంతో వారూ మందులు, ఆపరేషన్ కిట్లు, ఇతర సామగ్రిని దవాఖానలకు సరఫరా చేసేందుకు విముఖత వ్యక్తంచేస్తున్నారు.
జిల్లా ప్రధాన దవాఖానల్లో ఆపరేషన్లు చే యడానికి ఇచ్చే అనస్తీషియా మందులైన బుపివ్యాక్సినల్ ైగ్లెకోఫిరమ్లెట్, లింగ్నోకైన్ ఫా ర్ములా మందులకు ఇబ్బందులున్నాయి. శరీరంలో బ్యాక్టిరీయాను అరికట్టే పిపరేసిలియన్ టాడోబాక్టిమ్ మందులు లేవు. యాంటిసెప్టిక్‌గా ఇచ్చే పొవిడిన్ ఇండైన్, బ్లీడింగ్‌ను నిలిపే టాన్సిమిక్ యాసిడ్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. గర్భిణులకు ఇచ్చే ఇంజెక్షన్లు మందులు నిండుకున్నాయి. ఇలా కీలకమైన మందుల పంపిణీలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని వాపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలను బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యవిద్య పరిధిలోకి తీసుకువచ్చింది. వీటిని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నిర్వహిస్తుండగా, అత్యంత కీలకమైన దవాఖానలకు అన్ని రకాల డ్రగ్స్, సర్జికల్ పరికరాలు, మెడిసిన్స్ ప్రభుత్వమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. పంపిణీలో ఆలస్యం జరిగినా, ఇతర ఇబ్బందులు ఎదురైనా రోగులు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో జిల్లా దవాఖానల వారీగా ప్రైవేట్ ఫార్మా, సర్జికల్ డిస్ట్రిబ్యూటరీలతో కాంట్రాక్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతీ జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కమిటీలు వేసి, అన్ని మందులకు సంబంధించి టెండర్లను చేపట్టింది. ప్రభుత్వం నుంచి సరఫరా లేని మందులు, సర్జికల్ వస్తువులను.. టెండర్ పొందిన ఫార్మా, సర్జికల్ కంపెనీలు సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటికి జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ అనుమతితో ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి. ఈ పద్ధతిలో జగిత్యాలతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్లు, కలెక్టర్లు టెండర్లను నిర్వహించి మందులు అనుగుణంగా సరఫరా చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని ప్రతీ జిల్లా ప్రధాన దవాఖానలో మందుల కొరత ఉందని అధికారులు చెప్తున్నారు. ఒక్కో జిల్లా ప్రధాన దవాఖానకు కంపెనీలు సరఫరా చేసిన మందులకు రూ.కోటి నుంచి రూ.15కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు పడిందని వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకు పై గా ప్రైవేట్ డిస్ట్రిబ్యూటరీలకు ప్రభుత్వం బ కాయిలు పడినట్టు చెప్తున్నారు. ప్రభుత్వం ఎంపికైన ఫార్మా కంపెనీల నుంచి తెప్పించకుండా, బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా లో కల్ డిస్ట్రిబ్యూటరీల నుంచి మందులు సమకూర్చుకుంటూ వస్తున్నామని, వాళ్లు కూడా ససేమీరా అంటున్నారని పేర్కొంటున్నారు.