హైదరాబాద్, మే 14 (నమస్తేతెలంగాణ): చేయూత పింఛన్లలో కోతపెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తున్నది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, రెండున్నరేండ్లుగా ఆ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్త వారికి పింఛన్ల మంజూరు దేవుడెరుగు ఉన్నవాటికే ఎసరు పెట్టందుకు సిద్ధమైనట్టు తెలస్తున్నది. ఇప్పటికే అనర్హులు, మరణించిన, వలసవెళ్లినవారి పేరిట సుమారు 2.5 లక్షల పింఛన్లను ఏరివేసింది. మరికొంత మందిని తొలగించేందుకు రోజుకో విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నది.
గత నెలలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. తాజాగా లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నది. విధానమేదైనా 25% మంది చేయూత లబ్ధిదారులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్ర ప్రభుత్వం లైవ్ అథెంటిఫికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం-టీసీఎస్ జాయింట్ వెంచర్ అయిన ‘మెసెర్స్ టీజీ ఆన్లైన్’కు బాధ్యతలు అప్పగించింది.
మే 15 నుంచి జూన్ 15 వరకు మొదటి దశ ప్రక్రియ పూర్తిచేయాలని సంకల్పించింది. ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్, ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా అనర్హులను గుర్తించాలని నిర్దేశించింది. అయితే, ఏదేని కారణాలతో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే, అర్హులు సైతం పింఛన్లకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే బ్యాంకు ఖాతాల నుంచి మూడు నెలలు పింఛన్ నగదు విత్‌డ్రా చేయని వారిని మరణించినట్టుగా భావించి తొలగిస్తున్నారు. పొరపాటు జరిగిన సందర్భాల్లో తిరిగి రికవరీ చేసిన ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. కానీ, ఉన్నట్టుండి లైవ్ అథెంటిఫికేషన్ సిస్టంను తీసుకురావడంపై లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నది.
కేసీఆర్ హయాంలో వృద్ధులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, బీడీ కార్మికులకు మొత్తంగా 44.7 లక్షల మందికి పింఛన్లు అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే డబుల్ పింఛన్లు, మరణించిన వారి పేరిట సుమారు 1.4 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. 2025లో పింఛన్ల సర్వే పేరిట సుమారు మరో లక్ష మందిని తొలగించారు. వెరసీ మొత్తంగా 30 నెలల్లో సుమారు 2.5 లక్షల మందిని తగ్గించారు. ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకొనేందుకు లబ్ధిదారుల ఏరివేతకు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఫోరెన్సిక్ అడిట్ అని ఒకసారి, ఫేస్ రికగ్నేషన్ విధానమని మరోసారి తాజాగా లైవ్‌నెస్ అథెంటికేషన్ పద్ధతిని ఆచరణలోకి తీసుకొచ్చిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2024 జనవరిలో ప్రజాపాలన గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత కూడా పలుమార్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సుమారు 25 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రిలో సుమారు 5.18 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరిని గుర్తించి రెండేండ్లు దాటినా పింఛన్లు మంజూరు చేయడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్ మంజూరుచేసిన దాఖలాలులేవు. నిరుడు జూలైలో సర్వే పేరిట హంగామా చేసింది. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నది.
కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అడుగులు మాత్రం పడటంలేదు. 2026-27 బడ్జెట్ కేటాయింపులే ఇందుకు నిదర్శనం. రెండు బడ్జెట్ కేటాయింపుల మాదిరిగానే మూడో బడ్జెట్లోనూ రూ.14, 861 కోట్లే ప్రతిపాదించింది. అంటే కొత్త పింఛన్ల మంజూరు ఉండబోదని పరోక్షంగా తేల్చిచెప్పింది. అయితే, మరణించిన, వలస పోయిన లబ్ధిదారులను తొలగించి వారి స్థానంలో కొందరికి మంజూరు చేసి మమ అనిపించాలని భావిస్తున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది.