Telangana | కరీంనగర్/సూర్యాపేట, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/ రాజాపేట : ధాన్యం పండించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ‘తెలంగాణ’లో మళ్లీ సాగునీటి దైన్యం నెలకొన్నది. పదేండ్ల పాటు పచ్చగా కళకళలాడి సిరులు పండించిన పొలాలు.. ఈ యాసంగిలో చాలాచోట్ల పడావుపడి వెక్కిరిస్తున్నాయి. ‘తలాపున గోదావరి, మన చేను.. చెలక ఎడారి’ ఆని పదేండ్ల కింద పాడుకున్న పాటను ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కారు రైతులతో మళ్లీ పాడిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టానికే జీవధారగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రలతో పక్కనబెట్టి పొలాలను ఎండబెడుతున్నది.
రేవంత్ సర్కార్ నిర్వాకంతో రైతుభరోసా అందక.. రుణమాఫీ పూర్తికాక అప్పులు చేసి పంటలు వేసిన అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కాలువల్లో నీళ్లు రాక.. చెరువులు, కుంటలు ఎండిపోయి బావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లతో వేసిన పంటలు చేతికొస్తాయా అని దిగులుచెందుతున్నారు. 1000 ఫీట్ల వరకు బోర్లు వేసినా దుమ్మే తప్ప చుక్క నీరు రాకపోవడంతో బిక్కముఖం వేస్తున్నారు. నాట్ల దశలోనే చాలాచోట్ల పొలాలు ఎండిపోతున్నా.. మొద్దునిద్ర వీడని సర్కారుపై కన్నెర్రజేస్తున్నారు.
ఒకప్పుడు నీటి హబ్‌గా ఉన్న కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులకు మళ్లీ సాగు నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, కాళేశ్వరం ప్రాజెక్టులతో భూగర్భ జలాలు సైతం పెరిగి ఏటా రెండు పంటలు పండించిన రైతులకు ఇప్పుడు సాగు నీటి కటకట తలెత్తింది. ముఖ్యంగా మిడ్‌మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ కుడి కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీటి గోస ఎదురవుతున్నది.
ఈ కాలువ పరిధిలో 49 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా, 18 నుంచి 20 వేల ఎకరాలకే అందుతున్నది. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ప్రారంభమయ్యే కుడి కాలువ సైదాపూర్ మండలం బొమ్మకల్ దాకా వెళ్తుంది. ప్రస్తుతం ఇదే మండలం దుద్దెనపల్లి వరకే నీళ్లిస్తున్నారు. 4-ఎల్ ద్వారా మానకొండూర్ మండలం చెంజర్ల, నిజాయితీగూడెం, పెద్దూరుపల్లి వరకు నీరందాల్సి ఉన్నది. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం, పర్లపల్లి, నల్లగొండ, మక్తపల్లి, మన్నెంపల్లి, పోలంపల్లి, పోరండ్లకు ఇంకా నీళ్లు చేరలేదు.
సూర్యాపేట జిల్లా పరిధిలో ఎస్సారెస్పీ ఫేజ్-2 కింద ఉన్న 2.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు చుక్క నీరు వచ్చిన ఆనవాళ్లు లేకపోగా కాళేశ్వరం ప్రాజెక్టే జీవధారగా మారింది. కాంగ్రెస్ చిన్న సాకుతో కాళేశ్వరాన్ని పక్కనపెట్టడంతో యాసంగిలో వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. యాసంగిలో 2.40 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. నిరుడు యాసంగి దుస్థితి పునరావృతమవుతుందేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని 11 గొలుసుకట్టు చెరువులు, 32 కుంటలను నింపి 35,131 ఎకరాలకు సాగు నీరందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితో రూ.12 కోట్లు విడుదలయ్యాయి. గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాక ముందే కాళేశ్వరం ప్యాకేజీ 15లో భాగంగా 29 కిలో మీటర్ల పొడవున బ్యాచ్ కెనాల్ తవ్వకం కోసం మండలంలో 157 ఎకరాల భూమిని సేకరించారు.
సింగారంలో 40.10 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం అందజేశారు. నిరుడు వర్షాలతో చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగి యాసంగిలో 20 వేలకు పైగా ఎకరాల్లో వరి పండించారు. ఈ యాసంగిలో చెరువులన్నీ అప్పుడే వట్టి పోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి బోరుబావులు, బావులు ఎండిపోతున్నాయి. 1000 ఫీట్ల వరకు బోర్లు వేసినా దుమ్మే తప్ప చుక్క నీరు రావడం లేదు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని గ్రామాల్లో పొలాలు ఎండి పోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ రిజర్వాయర్‌కు నేరుగా ఎత్తిపోతల సదుపాయం ఉన్నది. సకాలంలో ఎత్తిపోతలు చేపడితే చొప్పదండి నియోజకవర్గంలోని 70 చెరువులను నింపే అవకాశం ఉండేది. ఎల్లంపల్లి ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు వారం క్రితమే చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ప్రకటించినా ఇంతవరకు ప్రక్రియ ప్రారంభించలేదు. ఎస్సారెస్పీ ఫేజ్-2 కాలువల నుంచి వారం పాటు నీటిని విడుదల చేయగా సూర్యాపేట జిల్లాలో సగం పొలాలకు కూడా చేరుకోలేదు. అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, చివ్వెంల, నడిగూడెం, మునగాల, పెన్‌పహాడ్ మండలాల్లోని కాలువల్లో నీళ్లు పారడంలేదు.
చెరువులు వట్టి పోయి భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో కాంగ్రెస్ సర్కార్‌పై రైతన్నలు కన్నెర్రజేస్తున్నారు. రాజాపేట మండలంలోని గొలుసుకట్టు చెరువులను కాళేశ్వరం 15వ ప్యాకేజీ ద్వారా నింపాలని దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెలే అయిలయ్య ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం 15వ ప్యాకేజీ కాలువ పనులు పూర్తి చేసి సాగు జలాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని గోదావరి ఆయకట్టు ఎండుతుండటంతో రైతులు రాస్తారోకోలు చేపడుతున్నారు.
నారాయణపూర్ రిజర్వాయర్‌ను, చెర్లపల్లి (ఎన్)లో ఎండుతున్న పంటలను ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాగు నీటిని, పెట్టుబడి సహాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, ఇపుడు నీళ్లు ఇవ్వడం లేదని, పెట్టుబడి సహాయం అందడం లేదని వాపోయారు. నీళ్లు ఇస్తారో లేదోనని పంటలు సాగు చేయలేదని చెప్పారు. రవిశంకర్ రిజర్వాయర్‌ను పరిశీలించి, రైతులతో మాట్లాడి వచ్చిన విషయం తెలుసుకున్న అధికారులు ఆగమేఘాలపై ఇదే రోజు సాయంత్రం ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేశారు. నీటి విడుదల బీఆర్ఎస్, రైతుల విజయమన్న సుంకె.. రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమైతే తనను ఒక రోజు హౌస్ అరెస్ట్ చేశారని గుర్తుచేశారు.
పదేండ్ల పాటు కేసీఆర్ సారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కడుపున పెట్టుకొని చూసుకున్నరు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మా మండలంలో చెరువులన్నీ వట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీటి సాధన కోసం రైతు జేఏసీగా ఏర్పడి నిరసన దీక్షలు చేపడుతుంటే అనుమతుల పేరిట పోలీసులు అడ్డుకుంటున్నరు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా సాగునీళ్లిచ్చేదాకా పోరాటాన్ని ఆపం.
– ఎర్రగోకుల జశ్వంత్, రైతు జేఏసీ మండల కన్వీనర్, రాజాపేట
నిరుడు యాసంగిలో నాకున్న మూడెకరాలు సాగు చేసిన. మా పొలం పక్కనే ఉన్న చెరువులో చుక్క నీరు లేదు. ఉన్న మూడు బోర్లు వట్టి పోయినయ్. ఈ సారి సాగు నీళ్లు లేక సిరులు పండే భూములను పడావు పెట్టిన. ఉపాధి కోసం మళ్లీ వలసలు పోయే రోజులు వస్తాయేమోనని భయమైతాంది.
– రంగ భద్రయ్య, రైతు, పాముకుంట, రాజాపేట మండలం