Health City | వరంగల్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత సేవలు అందించేలా వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు రచించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సకల వైద్య సౌకర్యాలతో వరంగల్లో 24 అంతస్థుల సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవనాన్ని శరవేగంగా పూర్తి చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులు నిలిచిపోయాయి.
మిగిలిపోయిన కొద్దిపాటి పనులు పూర్తి చేసి, వైద్య పరికరాలను అమర్చే దశలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన దవాఖానపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ సర్కారు సాకులు చెబుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దవాఖాన నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు 3 రోజుల క్రితం ఓ మంత్రితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని వారు కోరినట్టు తెలుస్తున్నది.
వరంగల్లో అధునాతన వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం 2021 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. రూ.1,116 కోట్లను కేటాయించారు. భవన నిర్మాణం, సర్వీసుల కోసం రూ.884 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.107 కోట్లు, ఇతర పన్నులకు రూ.125 కోట్లుగా నిర్ణయించారు. 2208 పడకలతో దవాఖాన నిర్మించాలని, పీఎంఎస్ఎస్వై దవాఖానలోని 250 పడకలతో కలిపి 2458 పడకల అద్భుతమైన దవాఖాన ఏర్పాటు చేయాలని భావించారు. నిర్ణయించిన నమూనా ప్రకారం దవాఖానలో 35 విభాగాల్లో, 500 డాక్టర్లు, 1000 మంది నర్సులు, 1000 మంది పారామెడికల్, ఇతర సిబ్బంది పని చేసేలా సదుపాయాలు కల్పించాలని భావించారు.
పరీక్షలు, అత్యవసర సేవలు, అన్ని బెడ్లకు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం, శస్త్రచికిత్సలు, అవయవాల మార్పిడి, కీమోథెరపీ, రేడియేషన్, సెంట్రల్ కిచెన్ వంటి సదుపాయాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచించారు. పర్యావరణహిత భవనం, వ్యర్థాల నిర్వహణకు సదుపాయంతో నిర్మించేలా డిజైన్ చేశారు. రోగులకు మరిన్ని వసతులు కల్పించేందుకు డిజైన్లో మార్పులు చేయాల్సి వచ్చింది. నిర్మాణ ఖర్చులు పెరగడంతో అధికారులు అంచనాలు పెంచారు. నిర్మాణ పనులు 2023 నవంబర్ చివరి వరకు పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఎన్నికల షెడ్యూల్తో పనుల్లో జాప్యం జరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు దాదాపుగా ఆగిపోయాయి. ఇందుకు కారణం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 29న సీఎం రేవంత్రెడ్డి వరంగల్లో పర్యటించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. నిర్మాణ అంచనాలు పెరిగాయని, ఖర్చులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దాదాపు పూర్తికావొచ్చిన దవాఖాన పనులు రేవంత్రెడ్డి ఆదేశాలతో నెమ్మదించాయి. విచారణ పేరుతో అద్భుతమైన దవాఖానను అడ్డుకోవడం సరికాదని వరంగల్ సహా చుట్టుపక్కల జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. త్వరగా దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.