హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో దేవుళ్లపై ఒట్లు.. ప్రతిపక్షంపై తిట్లు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. చాకలి ఐలమ్మ వర్సిటీకి రూ.500 కోట్లు, ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి నెలదాటినా ఉద్ధరించిందేమీలేదని మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు బాలరాజ్యాదవ్, పల్లె రవికుమార్, పార్టీ నేతలు యాదయ్యగౌడ్, రాంబల్నాయక్తో కలిసి మీడియాతో మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ హామీని అమలుచేయాలని కోరిన నిరుద్యోగులపై సర్కార్ దాష్టీకానికి దిగడం దుర్మార్గమని మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్ హామీని జాబ్‌లెస్‌గా మార్చారని మండిపడ్డారు. రెండేండ్లలో కేవలం 11 వేల ఉద్యోగాలు ఇచ్చి 60 వేలు ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల రక్షణ లేకుండా రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లే పరిస్థితిలేదని, ఇటీవల ప్రైవేట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు అశోక్‌నగర్‌కు వెళ్లిన సందర్భంలో నిరుద్యోగులపై నిర్బంధం ప్రయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. లాఠీలు, తూటాలకు నిరుద్యోగ యువత భయపడబోదని చెప్పారు. జాబ్‌క్యాలెండర్ హామీని నమ్మి గద్దెనెక్కించిన నిరుద్యోగులే కాంగ్రెస్ సర్కార్‌కు మరణ శాసనం రాసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
యూనివర్సిటీల్లో చదువుకుంటున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కంటే, అక్కడి భూములపైనే సీఎంకు ప్రేమ ఎక్కువని ఎర్రోళ్ల విమర్శించారు. హెచ్‌సీయూలో 450 ఎకరాలు, ఉర్దూ వర్సిటీలోని 200 ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు యత్నించడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ఇదే తరహాలో రేవంత్‌రెడ్డి గ్యాంగ్ ఉస్మానియా భూములపై రెక్కీ నిర్వహిస్తున్నదేమోనని అనుమానం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఐఎస్బీ భూములను వెనక్కి తీసుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి విద్యాశాఖకు బదులు రియల్ఎస్టేట్ శాఖకు మంత్రిగా ఉంటే బాగుండేదని ఎద్దేవాచేశారు.
బాధ్యాతయుతమైన హోదాల్లో ఉన్న మంత్రుల వ్యవహారశైలితో తెలంగాణ పరువు గంగపాలవుతున్నదని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. వారి చిల్లర చేష్టలు, చిలిపిపనులను చూసి ప్రజలు అసహ్యించుకొనే పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటల్లో చేపలు పెంచి నీలి విప్లవం సృష్టిస్తే, మంత్రులు మాత్రం మరో తరహా ‘నీలి’విప్లవానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. తప్పుడు పనులతో తెలంగాణ సమాజానికి తలవంపులు తెస్తున్నారని మండిపడ్డారు.